ఆస్కార్ వేదికపై నాటునాటు... పాట!

ఈసారి ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవంలో భారత్‌ చిత్రపరిశ్రమకి అపూర్వమైన గౌరవం లభించబోతోంది. ఆర్ఆర్ఆర్‌ చిత్రంలోని నాటునాటు పాట ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ విభాగంలో ఆస్కార్ అవార్డుకి పోటీపడుతున్న సంగతి తెలిసిందే. ఆ పాటని ఆస్కార్ అవార్డుల వేదికపై పాడేందుకు ఎంపిక చేసిన్నట్లు ఆస్కార్ అవార్డుల కమిటీ ప్రకటించింది. కనుక సినిమాలో ఈ పాటని పాడిన గాయకులు రాహుల్ సిప్లీగంజ్, కాలభైరవలు ఆస్కార్ వేదికపై పాడబోతున్నారు. 

యావత్ ప్రపంచదేశాలు ఎంతో ప్రతిష్ఠాత్మకంగా భావించే ఆస్కార్ అవార్డుల కార్యక్రమంలో ఓ తెలుగు పాట వినిపించడం తెలుగువారికి, యావత్ భారతీయులకి కూడా గర్వకారణమే. మార్చి 12వ తేదీన లాస్ ఏంజలీస్ నగరంలోని డల్బీ థియేటర్‌లో 95వ ఆస్కార్ అవార్డుల ప్రధానోత్సవం జరుగబోతోంది. ఆ వేదికపైనే మన తెలుగు పాట వినపడబోతోంది. 

అయితే ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ విభాగంలో ‘ఎవ్రీథింగ్ ఎవ్రీవేర్ ఆల్ ఎట్ వన్స్’ సినిమా నుంచి ‘దిస్ ఈజ్ ఆల్ రైట్’ అనే పాట, ‘టెల్ ఇట్ లైక్ ఏ వుమన్’ అనే సినిమా నుంచి అప్లాజ్’ అనే పాట , ‘బ్లాక్ పాంథర్ వకాండ ఫరెవర్’ అనే సినిమా నుంచి ‘లిఫ్ట్ మి అప్’ అనే పాటలతో ఆర్ఆర్ఆర్‌ నుంచి నాటు నాటు పాట పోటీ పడబోతోంది. వాటితో పోటీపడి నాటునాటు పాట ఆస్కార్ అవార్డు గెలుచుకొంటే అది భారతీయులందరికీ గర్వకారణం అవుతుంది. 

ఆర్ఆర్ఆర్‌ సినిమా ఆస్కార్ అవార్డులకి నామినేట్ చేయదగిన మంచి చిత్రమైనప్పటికీ భారత ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ కమిటీ దానిని పక్కన పెట్టేసింది. అప్పుడు రాజమౌళి ప్రైవేటుగా ఆర్ఆర్ఆర్‌ సినిమాని ఆస్కార్ అవార్డుల కమిటీకి పంపించి వివిద విభాగాలలో అవార్డుల కోసం పరిశీలించవలసిందిగా దరఖాస్తు చేసుకొన్నారు. 

ఆనాడు ఆయన ధైర్యం చేసి తీసుకొన్న ఆ నిర్ణయం వలన, ఆస్కార్ అవార్డు ఖరారు కాకముందే భారత్‌ పేరు ప్రపంచదేశాలలో మారుమ్రోగిపోతోంది. ఆర్ఆర్ఆర్‌ సినిమా ఇప్పటికే ప్రతిష్ఠాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్, హాలీవుడ్ ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ అవార్డులను అందుకొంది. ఆస్కార్ అవార్డ్ కూడా గెలుచుకొంటే చాలా సంతోషం.