అవును హీరో నాగ చైతన్య కస్టడీ నుంచి శనివారం విడుదలయ్యాడు. అంటే పోలీస్ కస్టడీ నుంచి కాదు... తన సినిమా కస్టడీ షూటింగ్ నుంచి! నిన్న శుక్రవారం కస్టడీ సినిమా షూటింగ్ పూర్తవడంతో దర్శకుడు చివరి సీన్ షూట్ చేసిన తర్వాత 'కట్' చెప్పి ‘నేటితో మా కస్టడీ నుంచి నీకు విముక్తి కల్పిస్తున్నాను,” అని చెప్పగానే అందరూ హాయిగా నవ్వుకొంటూ ఒకరికొకరు అభినందనలు తెలుపుకొన్నారు. ఈ సినిమా తప్పక సూపర్ హిట్ అవుతుందంటూ శుభాకాంక్షలు తెలుపుకొన్నారు. ఈ సినిమా షూటింగ్లో తనకు ఎంతగానో సహకరించిన చిత్రబృందానికి పేరుపేరునా నాగ చైతన్య కృతజ్ఞతలు తెలుపుకొని వారితో సెల్ఫీలు దిగారు.
తమిళ దర్శకుడు వెంకట్ ప్రభు దర్శకత్వంలో నాగ చైతన్య పోలీస్ ఆఫీసర్‌గా నటించగా అతనికి జోడీగా కృతీ శెట్టి నటించింది. ప్రియమణి, రాధికా శరత్ కుమార్, అరవింద స్వామి, శరత్ కుమార్, సంపత్ రాజ్, ప్రేమి విశ్వనాథ్, వెన్నెల కిషోర్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. తెలుగు, తమిళ్ భాషల్లో రూపొందిన ఈ సినిమాని శ్రీనివాస సిల్వర్ స్క్రీన్స్ బ్యానర్‌పై చిత్తూరి శ్రీను నిర్మించారు. ఈ సినిమాకి కెమెరా: ఎస్సార్ కదీర్, సంగీతం: యువన్ శంకర్ రాజా అందించారు. మే 12వ తేదీన ఈ సినిమా విడుదల కాబోతోంది.