పవన్‌ కళ్యాణ్‌ కొత్త సినిమా షూటింగ్‌ ప్రారంభం!

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ తన మేనల్లుడు సాయి ధరమ్ తేజ్‌తో కలిసి సముద్రఖని దర్శకత్వంలో కొత్త సినిమా షూటింగ్‌ బుదవారం నుంచి మొదలుపెట్టేశారు. ఈ సినిమా గురించి చాలా రోజులుగా వార్తలు వస్తున్నాయి కానీ పవన్‌ కళ్యాణ్‌ ఇంత త్వరగా దీనిని మొదలుపెట్టేస్తారని ఎవరూ ఊహించలేదు. ఈ సినిమాలో పవన్‌ కళ్యాణ్‌ పాత్ర పూర్తిచేయడం కోసం 25 రోజులు కేటాయిస్తే చాలని చెప్పడంతో పవన్‌ కళ్యాణ్‌ వెంటనే ఈ సినిమా మొదలుపెట్టేసిన్నట్లు తెలుస్తోంది.

తమిళంలో సూపర్ హిట్ అయిన ‘వినోదాయ సీతాం’ అనే కామెడీ ఫిక్షన్ సినిమాకి తెలుగు రీమేక్‌గా దీనిని తెరకెక్కిస్తున్నారు. మంచి నటుడిగా, దర్శకుడిగా తన సత్తా నిరూపించుకొన్న సముద్రఖని గత కొంతకాలంగా నటుడిగా బిజీగా ఉన్నారు. ఈ సినిమా కోసం మళ్ళీ చాలా కాలం తర్వాత మెగాఫోన్ పట్టుకొన్నారు. టిజి విశ్వప్రసాద్, వివేక్ కూచిబొట్ల కలిసి పీపుల్స్ మీడియా బ్యానర్‌పై ఈ సినిమాని నిర్మిస్తున్నారు.