ఈ గౌరవం అపూర్వం... రిషబ్ శెట్టి

కన్నడ నటుడు రిషబ్ శెట్టి స్వీయ దర్శకత్వంలో చేసిన ‘కాంతార’ సినిమా ఆయనకి గొప్ప పేరు ప్రతిష్టలు, నిర్మాతకి భారీగా లాభాలు ఆర్జించిపెట్టడమే కాకుండా ఓ అపూర్వమైన గౌరవం తెచ్చిపెట్టింది. సోమవారం ముంబైలో దాదాసాహేబ్  ఫాల్కే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ జరిగింది. దానిలో కాంతార సినిమాని కూడా ప్రదర్శించగా రిషబ్ శెట్టికి మోస్ట్ ప్రామిసింగ్ యాక్టర్ అవార్డు అందుకొన్నారు.

ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డు నాకు రావడం ఎంతో గౌరవంగా భావిస్తున్నాను. కాంతారతో అవకాశం ఇచ్చిన హోంబలే ఫిల్మ్స్, నిర్మాత విజయ్‌ కిరగందూర్ సర్‌కి ఈ సందర్భంగా మరోసారి మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. కాంతార విజయంలో చిత్ర బృందం నా జీవిత భాగస్వామి ప్రగతి శెట్టి సహకారం మరవలేనిది. వారి సహకారంతోనే ఇది సాధ్యమైంది. ఈ అవార్డుని కర్ణాటక ప్రజలు, స్వర్గీయ పునీత్ రాజ్‌కుమార్‌ (నటుడు), స్వర్గీయ భగవాన్ (దర్శకుడు) గారికి అంకితమిస్తున్నాను, “ అంటూ బహిరంగ లేఖ ద్వారా తనని  అభిమానించే వారందరికీ రిషబ్ శెట్టి కృతజ్ఞతలు తెలుపుకొన్నారు. 

కాంతార సినిమాని రూ.16 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కించగా, రూ.400 కోట్లు కలక్షన్స్‌ సాధించి రికార్డు సృష్టించింది. కన్నడ, తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ భాషల్లో విడుదల చేయగా అన్ని భాషల్లో మంచి ఆదరణ పొందింది. కర్ణాటక అడవులలో నివసించే గిరిజనుల జీవనశైలి, వారి భూతకోల సంస్కృతిని కళ్ళకి కట్టిన్నట్లు చూపడంతో దేశ ప్రజలందరూ కాంతారని ఆదరించారు. ఇప్పుడు ఈ సినిమాకి సీక్వెల్‌ని రిషబ్ శెట్టి సిద్దం చేస్తున్నాడు.