తెలుగు సినీ పరిశ్రమలో ఎప్పుడు ఏ ఎన్నికలు జరిగినా అందరూ మీడియా ముందుకు వచ్చి ఒకరినొకరు విమర్శించుకోవడం, పరస్పర ఆరోపణలు చేసుకోవడం పరిపాటిగా మారిపోయింది. రేపు ఆదివారం నిర్మాతల మండలి ఎన్నికలు జరుగబోతున్నాయి. కనుక మళ్ళీ అదే తంతు!
ఈసారి నిర్మాత సి.కళ్యాణ్ మీడియా ముందుకు వచ్చి నిర్మాతల మండలిలో 27 మంది గిల్డ్ సభ్యులు కలిసి మాఫియాగా ఏర్పడి మొత్తం సినీ పరిశ్రమ భవిష్యత్‌నే ప్రమాదంలోకి నెట్టేస్తున్నారని తీవ్ర ఆరోపణలు చేశారు. ఆ 27 మంది కలిసి సినీ పరిశ్రమలో చిన్న నిర్మాతలని అణచివేస్తున్నారని, వారి సినిమాలు రిలీజ్ కాకుండా అడ్డుపడుతున్నారని సి.కళ్యాణ్ ఆరోపించారు. చిన్న సినిమాలు లేకపోతే ఇండస్ట్రీ కూడా లేదన్నారు.
ఈ ఎన్నికలలో అధ్యక్షుడుగా పోటీ చేస్తున్న దామోదర ప్రసాద్ వర్గానికి చెందిన కొందరు నిర్మాత దిల్‌రాజుని తప్పుదోవ పట్టిస్తున్నారని ఆరోపించారు. వారితో చేతులు కలిపినందున రాజుని కూడా గిల్డ్ మాఫియాలో ఒకరని భావించవలసి వస్తోందన్నారు. ఈ గిల్డ్ మాఫియాయే నెలరోజుల పాటు సినిమా షూటింగ్‌లు నిలిపివేయించిందని, దాని వలన ఇండస్ట్రీ తీవ్రంగా నష్టపోయిందని, ముఖ్యంగా చిన్న నిర్మాతలు దెబ్బ తిన్నారని సి.కళ్యాణ్ ఆరోపించారు.
ఈసారి ఎన్నికలలో తాను పోటీ చేయడం లేదని కానీ సినీ పరిశ్రమని కాపాడుకోవాలనే తపనతోనే ఈరోజు మీడియా ముందుకు వచ్చి నిర్మాతల మండలిలో 1,200 మంది సభ్యులకీ వాస్తవాలు తెలియజేస్తున్నానని అన్నారు. కనుక సినీ పరిశ్రమని నాశనం చేస్తున్న ఆ 27 మంది చేతికి మండలిని అప్పగిస్తారో లేదా మండలిలో సభ్యులుగా ఉన్నవారినే ఎన్నుకొని కాపాడుకొంటారో మీ ఇష్టమని సి.కళ్యాణ్ అన్నారు.