మహాశివరాత్రికి శాకుంతలం ప్రత్యేక పోస్టర్‌

గుణశేఖర్ దర్శకత్వంలో సమంత, మలయాళ నటుడు దేవ్ మోహన్ శకుంతల దుష్యంతులుగా నటించిన ‘శాకుంతలం’ సినిమా ఫిభ్రవరి 17న విడుదల కావలసి ఉండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యమవడంతో ఏప్రిల్ 14వ తేదీకి వాయిదా పడింది. ఈరోజు మహాశివరాత్రి సందర్భంగా ఆ సినిమాలో శకుంతల దైవారాధన చేస్తున్న ఓ పోస్టర్‌ను విడుదల చేశారు. ఇప్పటి వరకు ఆ సినిమాలో నాలుగు లిరికల్ వీడియో సాంగ్స్ విడుదలకాగా అన్నీ  చాలా అద్భుతంగా ఉన్నాయి. కనుక సినిమా కోసం సమంత అభిమానులతో పాటు సినీ అభిమానులు అందరూ కూడా ఆతృతగా ఎదురుచూస్తున్నారు. 

శకుంతల, దుష్యంత రాజుల పౌరాణిక ప్రేమ గాధ ఆధారంగా గుణశేఖర్ ఈ సినిమాని అద్భుత ప్రేమకావ్యంగా తెరకెక్కించారు. నిర్మాత దిల్‌రాజు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్, గుణా టీం వర్క్స్ బ్యానర్లపై నీలిమ గుణ ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో నిర్మించారు.  

ఈ సినిమాలో మంచు మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. అల్లు అర్జున్‌ కుమార్తె అర్హ ఈ సినిమాలో చిన్నారి భరతుడిగా నటించారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు.