వైజాగ్‌లో పుష్ప2 షూటింగ్‌ సమాప్తం ఇప్పుడు...

సుకుమార్ దర్శకత్వంలో అల్లు అర్జున్‌, రష్మిక మందన జంటగా వచ్చిన పుష్ప సినిమాకి సీక్వెల్‌గా ‘పుష్ప2: ది రూలింగ్’ షూటింగ్‌ మొదలై చాలరోజులే అయ్యింది. గత కొన్ని రోజులుగా విశాఖపట్నంలో కొన్ని ముఖ్యసన్నివేశాలని చిత్రీకరించిన తర్వాత ఈ సినీ బృందం మళ్ళీ హైదరాబాద్‌ తిరిగివచ్చేసి వెంటనే రామోజీ ఫిలిమ్ సిటీలో షూటింగ్ మొదలుపెట్టేశారు. పుష్ప-1 సూపర్ హిట్ అవడంతో దాని సీక్వెల్‌గా వస్తున్న ఈ సినిమాపై చాలా భారీ అంచనాలున్నాయి. కనుక దర్శకుడు సుకుమార్ అందుకు తగ్గట్లుగానే పుష్ప-1లో నటించిన ఫహాద్ ఫాసిల్, ధనుంజయ్, సునీల్, రావు రమేష్, అనసూయ, అజయ్, శ్రీతేజ్, మీమ్ గోపిలతో పాటు మరికొంతమంది నటీనటులను తీసుకొన్నారు. వారిలో జగపతి బాబు కూడా ఒకరు. ఈ సినిమాలో జగపతిబాబు కీలకపాత్ర పోషిస్తున్నారు. హైదరాబాద్‌ షూటింగ్‌ షెడ్యూల్ పూర్తయిన తర్వాత చిత్ర బృందం థాయ్‌లాండ్ వెళ్ళబోతోంది. అక్కడ దట్టమైన అడవులలో కొన్ని ముఖ్యమైన సన్నివేశాలు చిత్రీకరించనున్నారు. 

తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న పుష్పా-2 సినిమాని నవీన్ ఎర్నేని, రవి శంకర్ కలిసి మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ: మీరొస్లా కుబా బ్రోజెక్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. పుష్ప2 ఈ ఏడాది డిసెంబర్‌లో లేదా 2024 సంక్రాంతి పండుగకి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది.