రామ్ చరణ్-శంకర్ కాంబినేషన్‌లో ఆర్‌సీ 15 వర్కింగ్ టైటిల్‌తో ఓ సినిమా షూటింగ్ జోరుగా సాగుతున్న సంగతి తెలిసిందే. శుక్రవారం ఉదయం నుంచి ఈ చిత్ర బృందం కర్నూలు పట్టణంలోని ప్రఖ్యాత కొండారెడ్డి బురుజు వద్ద షూటింగ్ చేయడం ప్రారంభించింది. సినిమా షూటింగ్ కోసం రామ్ చరణ్ అక్కడికి వచ్చిన్నట్లు తెలియగానే చుట్టుపక్కల ప్రాంతాల నుంచి వందలాదిమంది అభిమానులు హడావుడిగా బైక్‌లు, ఆటోల మీద తరలివచ్చేయడంతో అక్కడ పండగ వాతావరణం నెలకొంది. షూటింగ్ జరుగుతున్న ప్రాంతంలో భారీగా పోలీసులని మోహరించి అభిమానులని నియంత్రిస్తున్నారు. ట్రాఫిక్ పోలీసులు వాహనాలను వేరే మార్గంలోకి మళ్ళించి ట్రాఫిక్ నియంత్రించేందుకు శ్రమిస్తున్నారు.
కొండారెడ్డి బురుజు వద్ద శుక్రవారం జరుగుతున్న షూటింగ్‌లో రామ్ చరణ్, శ్రీకాంత్, రాజీవ్ కనకాల తదితరులు పాల్గొన్నారు. కొండారెడ్డి బురుజు కోట గోడకి ‘అభ్యుదయం పార్టీ’ అనే బ్యానర్ కట్టి వారి మీద ఓ రాజకీయసభ సన్నివేశాన్ని చిత్రీకరిస్తున్నారు. ఈ సినిమాలో రామ్ చరణ్ తండ్రీకొడుకులుగా ద్విపాత్రాభినయం చేస్తున్నారు. తండ్రి పాత్రకి జోడీగా అంజలి, కొడుకు పాత్రకి జోడీగా కియరా అద్వానీ, విలన్‌గా ఎస్ జే సూర్య, ఇంకా సునీల్, నాజర్, రఘుబాబు, జయరాం, సముద్రఖని, శ్రీకాంత్, నవీన్ చంద్ర తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాని రూ.170 కోట్ల భారీ బడ్జెట్‌తో దిల్‌రాజు, అల్లు శిరీష్ కలిసి శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ పతాకంపై నిర్మిస్తున్నారు. కార్తీక్ సుబ్బరాజు అందించిన కధతో రూపొందున్న ఈ సినిమాకు ‘అధికారి’ అనే టైటిల్ ఖరారు చేసినట్లు సమాచారం. కానీ ఇంకా ధృవీకరించాల్సి ఉంది.
ఈ సినిమాకి కెమెరా: తిరు, ఆర్ రత్నవేలు, సంగీతం: థమన్ అందిస్తున్నారు. గత ఏడాది అక్టోబర్‌లో ఈ సినిమా షూటింగ్ ప్రారంభించి హైదరాబాద్, విశాఖపట్నం, మహారాష్ట్ర, పంజాబ్‌లో కొన్ని కీలక సన్నివేశాలు తీశారు. 2023, వేసవి సెలవులలో ఈ సినిమా విడుదలయ్యే అవకాశం ఉంది.