శాకుంతలం వాయిదా... మరీ అంత ఆలస్యంగానా!

శకుంతలా దుష్యంతుల పౌరాణిక ప్రేమగాధని ‘శాకుంతలం’ సినిమాగా దర్శకుడు గుణశేఖర్ తెరకెక్కించారు. ఈ సినిమాలో సమంత, మలయాళ నటుడు దేవ మోహన్ శకుంతల, దుష్యంతులుగా నటిస్తున్నారు. ఈ సినిమా ఫిభ్రవరి 17వ తేదీన విడుదల చేయబోతున్నట్లు ప్రకటించారు. కానీ సినిమా రిలీజ్‌ డేట్ విషయంలో పొరపాటు జరిగిందని తెలియజేస్తూ ఈ సినిమాని ఏప్రిల్ 14వ తేదీన విడుదల చేయబోతున్నట్లు చిత్ర బృందం శుక్రవారం ప్రకటించింది.

మరో వారం రోజులలో రిలీజ్‌ కావలసిన సినిమా ఏకంగా రెండు నెలలు వాయిదా వేయడం చాలా అసాధారణమైన విషయమే. ఈవిదంగా ఎందుకు జరిగిందో దర్శక, నిర్మాతలు ఎవరూ వివరణ ఇవ్వలేదు కానీ త్వరలో శాకుంతలం ప్రమోషన్స్ మొదలుపెడతామని చెప్పారు.

శాకుంతలంలోని అద్భుతమైన సినిమా లిరికల్ వీడియో సాంగ్స్ కి మంచి స్పందన వస్తోంది. పాటలు, యానిమేషన్ చూసినవారు గుణశేఖర్ ఈ సినిమాని దృశ్యకావ్యంగా మలిచారని ప్రశంశిస్తున్నారు. త్వరలో సినిమా విడుదలైతే చూసి ఆనందిద్దామనుకొంటే, హటాత్తుగా రెండు నెలలు వాయిదా వేయడం చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. 

ఈ సినిమాలో అల్లు అర్జున్‌ కుమార్తె అర్హ చిన్నారి భరతుడిగా కనిపించబోతోంది. మోహన్ బాబు, ప్రకాష్ రాజ్, గౌతమి, అదితి బాలన్, అనన్య తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.

దిల్‌రాజు సమర్పణలో శ్రీ వేంకటేశ్వర క్రియెషన్స్ నీలిమ గుణ ఈ సినిమాను గుణా టీం వర్క్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాను తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషలలో పాన్ ఇండియా మూవీగా భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.