
అవును తెలంగాణా బ్రూస్లీ ఎవరంటే కెసిఆరే! అది దర్శకుడు రామ్ గోపాల్ వర్మ అభిప్రాయం. రెండు మూడు రోజుల క్రితమే దర్శకుడు మథుర శ్రీధర్ రెడ్డి ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణా పోరాటాలపై సినిమా తీస్తానని ప్రకటించగానే, రామ్ గోపాల్ వర్మ కూడా తను కూడా కెసిఆర్ జీవిత చరిత్ర ఆధారంగా సినిమా తీయబోతున్నట్లు, దాని పేరు ఆర్.సి.కె. (కెసిఆర్ పేరు తిరగేసి పెట్టాడు ఎందుకో?) అని ఇవ్వాళ్ళ ట్వీట్ మెసేజ్ ద్వారా ప్రకటించాడు.
అయితే తాను కెసిఆర్ పై తీయబోయే సినిమాలో ఆయన గురించి ఎవరికీ తెలియని అనేక విషయాలు ఉంటాయని అవి ఆయన కుమారుడు కెటిఆర్ తో మాట్లాడినప్పుడు తెలుసుకొన్నానని, అప్పుడే కెసిఆర్ పై సినిమా తీయాలని నిశ్చయించుకొన్నట్లు చెప్పాడు. కెసిఆర్ తెలంగాణాకి బ్రూస్లీ వంటివారని ఆయనపై తను తీయబోయే సినిమాలో అందాలభామ దీపికా పడుకొనే నటిస్తుందని కూడా తెలిపారు. రాజకీయనాయకులలో వికారతని, ఆమె అందచందాలతో చక్కగా మిక్స్ చేసి సినిమా చూపిస్తానని రామ్ గోపాల్ వర్మ ట్వీట్ మెసేజులో పేర్కొన్నాడు. అంటే ఆ సినిమాలో కమర్షియల్ ఎలిమెంట్స్ కూడా ఉంటాయని చెపుతున్నట్లే భావించవచ్చు. అలాగే రామ్ గోపాల్ వర్మకి చాలా ఇష్టమైన మర్డర్లు, రక్తం, నరుక్కోవడాలు కూడా ఉన్నా ఆశ్చర్యం లేదు. కానీ కెసిఆర్ జీవితంలో లేని ఆ సీన్లని వర్మ ఆ సినిమాలో ఏవిధంగా జొప్పిస్తారొ చూడాలి.
ఇంతకీ కెసిఆర్ పై ఆయన తీయబోతున్న సినిమాలో దీపికా పడుకోనే ని ఎవరి పాత్ర కోసం ఎంచుకొంటున్నారో చెప్పలేదు కానీ ఆమె అందచందాలని కలిపి చూపిస్తానని చెప్పడం ద్వారా రాజకీయాలలో అది ఎవరై ఉండవచ్చు? అనే ఊహాగానాలకి తెర తీసి, అప్పుడే తన మైండ్ లో ఉన్న ఆ సినిమాకి కూడా ఫ్రీ పబ్లిసిటీ సంపాదించడం మొదలుపెట్టేశాడు. దటీజ్ రామ్ గోపాల్ వర్మ!
శ్రీధర్ రెడ్డి తన సినిమాని వచ్చే ఏడాది జూన్ 2న షూటింగ్ మొదలుపెడతానని ప్రకటించారు కనుక ఈలోగానే రామ్ గోపాల్ రామ్ గోపాల్ వర్మ-తన బ్రూస్లీని ...అదే ఆర్.సి.కె. తీసేసినా ఆశ్చర్యం లేదు. అప్పుడు శ్రీధర్ రెడ్డి తన సినిమాని తీయాలావద్దా అని ఆలోచించుకోవలసి ఉంటుంది.