తెలుగు సినీ పరిశ్రమ ప్రజలను రంజింపజేస్తున్నప్పటికీ అన్ని రంగాలలో మాదిరిగానే అంతర్గతంగా కుమ్ములాటలతో సతమతమవుతూనే ఉంది. తెలుగు చలనచిత్ర నిర్మాతల మండలి (టి.ఎఫ్.పీ.సీ)కి ఎన్నికలు జరిపించాలంటూ ఇటీవల టి.ఎఫ్.పీ.సీ సభ్యులు తమ అధ్యక్షుడు, ప్రముఖ నిర్మాత సి.కళ్యాణ్‌తో గొడవపడ్డారు. ఆ తర్వాతే ఆయన ఎన్నికలు నిర్వహించేందుకు సిద్దపడ్డారు.
ఈరోజు హైదరాబాద్ ఫిలిమ్ ఛాంబర్‌లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ, “నాకు టి.ఎఫ్.పీ.సీకి అధ్యక్షుడుగా కొనసాగాలనే వ్యామోహం లేదు. కానీ నేను ఆ కుర్చీ పట్టుకొని వ్రేలాడుతున్నానని అందుకే ఎన్నికలు నిర్వహించడంలేదని కొందరు నోటికి వచ్చిన్నట్లు మాట్లాడుతున్నారు. వారిపై కటిన చర్యలు తీసుకోబోతున్నాము. ఫిభ్రవరి 1వ తేదీ నుంచి 6వరకు టి.ఎఫ్.పీ.సీ ఎన్నికలకి నామినేషన్స్ ప్రక్రియ నిర్వహించి, ఫిభ్రవరి 19వ తేదీన ఎన్నికలు జరుపుతాము. ఆదేరోజు సాయంత్రం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటిస్తాము. ఆ తర్వాత వెంటనే జనరల్ బాడీ మీటింగ్ నిర్వహిస్తాము,” అని తెలిపారు.
సినీ కళాకారులకి నంది అవార్డుల పురస్కారాలు అందజేయాలని ఈ సందర్భంగా నిర్మాత సి.కళ్యాణ్ రెండు తెలుగు రాష్ట్ర ప్రభుత్వాలకి విజ్ఞప్తి చేశారు. అలాగే సినీ పరిశ్రమకి ప్రభుత్వాలు చెల్లించాల్సిన రాయితీలను చెల్లించాలని విజ్ఞప్తి చేశారు.