రెండు రోజుల్లో మంచు మనోజ్ చెప్పబోయే వార్త ఇదే కదా?

ఒకప్పుడు మంచు మోహన్‌బాబు కుటుంబం వరుస హిట్స్ ఇస్తూ సినీ పరిశ్రమలో చాలా ఉన్నతస్థాయికి చేరుకొంది. కానీ ఆ తర్వాత పలు ఫ్లాపులు, కుటుంబ సమస్యలు, వివాదాల కారణంగా మంచు కరిగిపోయిన్నట్లు మంచు ప్రతిష్ట కరిగిపోతోంది. మోహన్‌బాబు పెద్ద కుమారుడు మంచు మనోజ్ ప్రేమ, పెళ్ళి, విడాకుల కారణంగా మంచు కుటుంబ సభ్యుల మద్య మనస్పర్ధలు ఏర్పడ్డాయి కూడా. మంచు మనోజ్ సినిమాలకి కూడా దూరం అయ్యాడు!

మంచు మనోజ్ మళ్ళీ తాను మొదట ప్రేమించిన దివంగత భూమా నాగిరెడ్డి, శోభ దంపతుల రెండో కుమార్తె భూమా మౌనిక ప్రేమలో పడటం, ఆమె కూడా తన  భర్తకి విడాకులు ఇచ్చి మనోజ్‌తో ప్రేమలో పడటంతో వారిరువురి జీవితాలలో మళ్ళీ కొత్త అధ్యాయం మొదలవుతోంది. త్వరలోనే ఇద్దరూ పెళ్ళి చేసుకోబోతున్నారని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. బహుశః మంచు మనోజ్ ఇదే విషయం తన అభిమానులకి తెలియజేయబోతున్నాడేమో? 

“కొన్ని రోజులుగా ఈ విషయాన్ని నా గుండెల్లోనే దాచుకొన్నాను. నా జీవితంలో రెండో అధ్యాయం ప్రారంభించబోతున్నందుకు చాలా ఉద్వేగంగా ఉన్నాను. ఈ నెల 20వ తేదీన దాని గురించి తెలియజేయబోతున్నాను. నాకు మీ అందరి ఆశీర్వాదాలు కావాలి.” అని ట్వీట్ చేశారు. దానిలో లవ్ సింబల్స్ ఉన్నాయి. అంటే మంచు మౌనికతో తన పెళ్ళెప్పుడో 20వ తేదీన తెలియజేయబోతున్నాడని అనుకోవచ్చు.