సినిమా తీసేవాళ్ళంటే ఇంత చులకనా?

వంశీ పైడిపల్లి దర్శకత్వంలో విజయ్, రష్మిక మందన జంటగా వచ్చిన వారసుడు చిత్రాన్ని, వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి సినిమాలతో పోటీపడుతూ సంక్రాంతి పండుగకి రిలీజ్‌ చేయడాన్ని చాలా మంది జీర్ణించుకోలేకపోతున్నారు. అటువంటివారు వారసుడు సినిమాపై సోషల్ మీడియాలో అనుచితంగా కామెంట్స్ చేస్తున్నారు. వారసుడు సినిమాని సినిమా అనడం కంటే ఫ్యామిలీ డ్రామా లేదా డైలీ సీరియల్ అనవచ్చంటూ ఎద్దేవా చేస్తున్నారు. 

వారికి దర్శకుడు వంశీ పైడిపల్లి ఘాటుగా బదులిచ్చారు. “ఒక సినిమాని తీయడానికి ఎంతో మంది ఎంతో కష్టపడవలసి వస్తుంది. సినిమా కోసం అనేక త్యాగాలు చేయవలసి వస్తుంది. అయినా సినిమా బాగా రావాలనే తపనతో అందరూ ఎంతో కష్టపడి పనిచేస్తుంటారు. సినిమాని బాగా తీయడానికి ఎంతగా కష్టపడాలో అంతా కష్టపడతాము. వారసుడు (తమిళంలో వారిసు) సినిమా కోసం విజయ్‌ కూడా చాలా కష్టపడ్డారు. కానీ దాని ఫలితం మా చేతుల్లో ఉండదు. ప్రేక్షకులే నిర్ణయిస్తుంటారు. కనుక వారసుడు సినిమా గురించి ఇలా అవహేళనగా మాట్లాడటం తగదు. 

డైలీ సీరియల్స్ కూడా తక్కువ చేసి మాట్లాడటం సరికాదు. ప్రతీరోజూ లక్షలాదిమంది వాటిని చూసి ఆనందిస్తుంటారు. సినిమాలైనా, డైలీ సీరియల్స్ అయినా సృజనాత్మకతతో కూడినవి. కనుక వాటిని  కించపరచడం సరికాదు. మనం బాగుండాలని కోరుకోవచ్చు కానీ ఎదుటవాడిని కిందకి లాగేద్దామనే ఆలోచనే సరికాదు. ఈ ప్రయత్నంలో మనం కూడా క్రిందకి జారిపోతుంటామని గ్రహిస్తే మంచిది. నెగెటివ్ ఆలోచనల నుంచి బయటపడకపోతే అవే మిమ్మల్ని తినేస్తాయని గుర్తుంచుకోండి. నేను ఓ కమర్షియల్ సినిమా తీశాను తప్ప ఏదో కళాఖండం తీశానని చెప్పుకోవడం లేదు కదా?మరెందుకు ఈ విమర్శలు, దెప్పిపొడుపులు?” అని ఆగ్రహం వ్యక్తం చేశారు.