
నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి జనవరి 12న విడుదల కాగా, మెగాస్టార్ చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య జనవరి 13న ప్రపంచవ్యాప్తంగా విడుదలయ్యింది. రెండు సినిమాలు సంక్రాంతి పండుగకి ముందు రిలీజ్ కావడంతో బాక్సాఫీస్ దద్దరిల్లిపోతోంది. మూడు రోజులలోనే రెండు సినిమాలు వంద కోట్లుపైగా కలక్షన్స్ సాధించడంతో ఇరువురి అభిమానులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇంకా నేడు రేపు కూడా కనుమ, ముక్కనుమ పండుగలు ఉన్నందున ఈ రెండు రోజులలోనే చెరో 50 కోట్లు వసూలు చేసినా ఆశ్చర్యం లేదు.
వీరసింహారెడ్డి నాలుగు రోజులలో రూ.104 కోట్లు సాధించగా, వాల్తేర్ వీరయ్య మూడు రోజులలోనే రూ.108 కోట్లు సాధించింది. కేవలం 24 గంటల వ్యవధిలో విడుదలైన ఈ రెండు సినిమాలు హిట్ అవడంతో వాటిని మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై వీటిని నిర్మించిన నిర్మాతలు నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్‌లకు కూడా భారీగా లాభాలు తెచ్చిపెట్టబోతున్నాయి. వీటిలో ఒకటి హిట్ అయ్యి మరొకటి ఫ్లాప్ అయిన ఒక దానిపై వచ్చిన లాభం రెండో దాని నష్టం పూడ్చుకోవడానికి సరిపోతుంది. కానీ రెండూ హిట్ అయినందున నిర్మాతలకి కనకవర్షం కురవబోతోంది.
చిరంజీవి ఏనుగుపై అంకుశం పట్టుకొని కూర్చోన్నట్లు ఓ పోస్టర్ వేసి వాల్తేర్ వీరయ్య మూడు రోజులలో ప్రపంచవ్యాప్తంగా రూ.108 కోట్లు గ్రాస్ కలక్షన్స్ సాధించిందని మైత్రీ మూవీ మేకర్స్ ప్రకటించింది.