ఆర్ఆర్ఆర్ సినిమాకి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ లభించినందుకు దేశవ్యాప్తంగా పలువురు ప్రముఖులు అభినందనలు తెలిపారు. వారిలో ఏపీ సిఎం జగన్మోహన్ రెడ్డి కూడా ఒకరు. ‘అంతర్జాతీయ స్థాయిలో తెలుగు జెండా ఎగరేసిన మీకు నా అభినందనలు’ అని ట్వీట్ చేస్తే బాలీవుడ్ సింగర్ అద్నాన్ సమీ వెంటనే స్పందిస్తూ, “అంతర్జాతీయస్థాయిలో ఉన్నప్పుడు భారత్ జెండా అని చెప్పాలి కానీ తెలుగు జెండా అనడం సరికాదంటూ” ట్వీట్ చేశారు. ఓ విదంగా అతని అభిప్రాయం సరైనదే కూడా. ఈ నేపధ్యంలో రాజమౌళి తాజా వ్యాఖ్యలు మళ్ళీ మరో దుమారం లేపేలా ఉన్నాయి.
‘డైరెక్టర్స్ గిల్డ్ ఆఫ్ అమెరికా’లో ఆర్ఆర్ఆర్ సినిమా ప్రదర్శించిన తర్వాత వారిని ఉద్దేశ్యించి రాజమౌళి మాట్లాడుతూ, “దీనిని కొందరు హిందీ సినిమా అని బాలీవుడ్ సినిమా అని అంటున్నారు. కానీ ఇది బాలీవుడ్ సినిమా కాదు. దక్షిణభారత్ నుంచి వచ్చిన ఓ తెలుగు సినిమా,” అని తెలియజేశారు.
ఉత్తరాది రాష్ట్రాల ప్రజలకి దక్షిణాది రాష్ట్రాల గురించి, విభిన్నమైన భాషలు, సంస్కృతుల గురించి నేటికీ అవగాహన లేనందున అందరూ మద్రాసీలే అని, దక్షిణాది వారందరూ ఒకే భాష మాట్లాడుకొంటారని అనుకొంటుంటారు. అదేవిదంగా భారత్ నుంచి ఏ సినిమా వచ్చినా అంతర్జాతీయస్థాయిలో దానిని బాలీవుడ్ సినిమా అనే అనుకోవడం పరిపాటి. అందుకే రాజమౌళి ఈ వివరణ ఇవ్వాల్సి వచ్చింది. అయితే దీనికీ ఎవరైనా పెడర్ధాలు తీస్తే ఇదీ మరో వివాదంగా మారవచ్చు.