లైగర్‌తో ప్రపంచాన్ని జయించేశామనుకొన్న పూరీ జగన్నాథ్, విజయ్ దేవరకొండ ఇద్దరూ ఇంట్లో బోర్లాపడ్డారు. లైగర్ కొట్టిన పంచ్ దెబ్బ నుంచి ఇప్పుడిప్పుడే కొలుకొంటున్న విజయ్ దేవరకొండ తన తర్వాత సినిమాని జెర్సీ దర్శకుడు గౌతమ్ తిన్ననూరితో చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశాడు.
ఆ సినిమా ఫస్ట్-లుక్ పోస్టర్‌ను కూడా విడుదల చేశాడు. దానిలో సముద్రంలో ఉన్న ఓడలలో మంటలు ఎగసిపడుతున్నట్లు చూపారు. ఆ బ్యాక్ గ్రౌండ్‌లో పోలీస్ డ్రెస్సులో ముఖానికి ముసుగు ధరించిన ఓ వ్యక్తిని అస్పష్టంగా ఉన్నట్లు చూపారు. పక్కనే “ఎక్కడివాడినో తెలీదు. ఎవరిని మోసం చేశానో చెప్పలేను.. ఓ అజ్ఞాత గూడఛారి,” అంటూ ఆసక్తికరమైన క్యాప్షన్ ఇచ్చారు. అంటే ఈ సినిమాలో విజయ్ దేవరకొండ స్మగ్లింగ్ గ్యాంగ్స్‌తో పోరాడే అండర్ కవర్ ఆఫీసర్ పాత్ర చేయబోతున్నట్లనిపిస్తుంది.
ఇంతకాలం రౌడీ హీరోగా ఒకే రకమైన పాత్రలు చేసుకొంటూ వెళ్ళిన విజయ్ దేవరకొండ తొలిసారిగా వాటికి భిన్నమైన పాత్ర చేస్తుండటం మంచిదే. జెర్సీ సినిమాతో తన సత్తా చాటుకొన్న గౌతమ్ తిన్ననూరి ఈ సినిమాకి కధ, దర్శకత్వం అందిస్తున్నందున తప్పకుండా ఆ స్థాయిలో చక్కటి సినిమా అందిస్తాడని ఆశించవచ్చు. అయితే భావోద్వేగాలను పండించడంలో దిట్ట అనిపించుకొన్న గౌతమ్ తిన్ననూరి రౌడీ హీరోతో యాక్షన్ సినిమా తీస్తుండటమే చాలా ఆశ్చర్యం కలిగిస్తుంది. కనుక భిన్న దృవాలవంటి వారిద్దరి కాంబినేషన్‌లో తెరకెక్కబోతున్న ఈ సినిమా ఏవిదంగా ఉంటుందో చూడాలి.
విజయ్ దేవరకొండ 12వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాని సితార ఎంటర్‌టైన్‌మెంట్స్, ఫార్చ్యూన్ ఫోర్ బ్యానర్‌లపై నాగ వంశీ, సాయి సౌజన్య నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించబోతున్నారు. కనుక త్వరలోనే ఈ సినిమాలో హీరోయిన్, నటీనటులు, టెక్నీషియన్స్ పేర్లు ప్రకటించనున్నారు.