
ఆర్ఆర్ఆర్ చిత్రంలో నాటునాటు పాటకి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ లభించడంపై ఆ పాట రచయిత చంద్రబోస్ ఓ వీడియో సందేశం ద్వారా తన సంతోషాన్ని అభిమానులతో పంచుకొన్నారు.
“ఈరోజు నా జీవితంలో మరిచిపోలేని మహాద్భుతమైన రోజు. ఈ 28 ఏళ్ళ ప్రస్థానంలో 850కి పైగా చిత్రాలకు 3,500కి పైగా పాటలు వ్రాశాను. ఆనాడు తాజ్ మహల్ సినిమా కోసం వ్రాసిన నా తొలిపాట మొదలు వాల్తేర్ వీరయ్య వరకు ప్రతీ పాటకి అదే మదనం... అదే జ్వలనం... అదే తపస్సు చేస్తున్నాను. బహుశః నా ఈ పాటల తపస్సుకి భగవంతుడు మెచ్చి ఈరోజు నాకు ఈ వరం ఇచ్చాడని నేను భావిస్తున్నాను. ఈ అవార్డు గెలుచుకోవడం నాకెంతో సంతోషంగా, గర్వంగా ఉంది. ఈ పాటకి అద్భుతమైన సంగీతం సమకూర్చిన కీరవాణికి, అద్భుతంగా పాడిన కాలభైరవకి, అద్భుతంగా కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్ మాస్టార్కి, అద్భుతంగా డ్యాన్స్ చేసిన రామ్ చరణ్, ఎన్టీఆర్కి, మా అందరికీ తన సినిమాతో ఈ అవకాశం కల్పించిన రాజమౌళికి, ఇంకా ఈ సినిమాలో భాగస్వామిగా ఉన్న ప్రతీ ఒక్కరికీ నేను పేరుపేరునా ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని చంద్రబోస్ అన్నారు.
ఆర్ఆర్ఆర్ సినిమాలో ఈ పాటకి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డు గెలుచుకోవవడంపై మెగాస్టార్ చిరంజీవి, ప్రముఖ సంగీత దర్శకుడు ఏఆర్ రహమాన్, ప్రధాని నరేంద్రమోడీ, రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రి కేసీఆర్, జగన్మోహన్ రెడ్డి, టిడిపి అధినేత చంద్రబాబు నాయుడు ఇంకా పలురంగాలకి చెందిన ప్రముఖులు సోషల్ మీడియాలో అభినందనలు తెలియజేస్తున్నారు.