పాట నాటే కానీ అవార్డ్ మాత్రం గోల్డెన్!

రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ హీరోలుగా వచ్చిన ఆర్ఆర్ఆర్‌ సినిమాలో నాటు నాటు పాట, దానికి వారివురూ అద్భుతంగా చేసిన డ్యాన్స్ అందరికీ తెలిసిందే. ఆ పాటకి సంగీతం అందించిన ఎంఎం కీరవాణి ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ అందుకొన్నారు. 

స్థానిక కాలమాన ప్రకారం బుదవారం కాలిఫోర్నియాలోని ది బెవర్లీ హిల్టన్ హాల్లో జరిగిన గోల్డెన్ గ్లోబ్ అవార్డుల ప్రధానోత్సవంలో కీరవాణి ఈ అవార్డుని అందుకొన్నారు. నాటునాటు పాటని ఉత్తమ ఒరిజినల్ సాంగ్‌ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డుకి ఎంపిక చేస్తున్నట్లు ప్రకటించగానే ఈ కార్యక్రమానికి హాజరైన రాజమౌళి, ఎన్టీఆర్‌, రామ్ చరణ్‌ తదితరులు లేచి నిలబడి చప్పట్లు కొడుతూ హర్షం వ్యక్తం చేశారు. 

ఈ సందర్భంగా కీరవాణి మాట్లాడుతూ, “ఈ అవార్డు నా కెరీర్‌లో అత్యంత విలువైనదిగా భావిస్తున్నాను. నాకు ఈ ప్రతిష్టాత్మకమైన అవార్డు ఇచ్చి గౌరవించినందుకు హెచ్ఎఫ్‌పీఏకి మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను. నాకు తన సినిమాలో అవకాశం కల్పించడం ద్వారా నాకు ఈ అవార్డు దక్కేలా చేసిన నా సోదరుడు రాజమౌళికి ఈ సందర్భంగా ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. నిజానికి ఈ అవార్డు ఆయనదే అని నేను భావిస్తున్నాను. ఈ పాటకు నా కుమారుడు కాలభైరవ చాలా సహకరించాడు. రాహుల్ సిప్లీ గంజ్ ఈ పాటని ఈ స్థాయికి చేర్చినందుకు ఈ సందర్భంగా అతనికి కూడా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. నా సతీమణి, ఆర్ఆర్ఆర్‌ బృందం సమక్షంలో నేను ఈ ప్రతిష్టాత్మకమైన ఈ అవార్డుని అందుకోవడం నా జీవితంలో మరిచిపోలేని మధురానుభూతిగా నిలిచిపోతుంది,” అని అన్నారు.

నాటునాటు పాటని చంద్రబోస్ రచించగా దానికి కీరవాణి అద్భుతంగా స్వరపరచగా ప్రేమ్ రక్షిత్ ఇంకా అద్భుతంగా కొరియోగ్రఫీ చేసి గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ స్థాయికి చేర్చారు. కనుక కీరవాణి చెప్పిన్నట్లుగా ఈ అవార్డు వారందరి సమిష్టి కృషికి దక్కిన ఫలమే.