వాల్తేర్ వీరయ్య కమర్షియల్ చిత్రమే కానీ... చిరంజీవి

బాబీ దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, శ్రుతీ హాసన్‌ జంటగా నటించిన వాల్తేర్ వీరయ్య సినిమా ప్రీరిలీజ్ ఈవెంట్‌ ఆదివారం సాయంత్రం విశాఖపట్నంలో అట్టహాసంగా జరిగింది. ఈ కార్యక్రమానికి హాజరైన వేలాదిమంది అభిమానులని ఉద్దేశ్యించి చిరంజీవి మాట్లాడుతూ, “వాల్తేర్ వీరయ్య కమర్షియల్ సినిమాయే కానీ ప్రేక్షకులు ఊహించనంతగా మంచి కామెడీ, ఫైట్స్, భావోద్వేగ సన్నివేశాలతో చాలా గొప్పగా ఉంటుంది. బాబీ నాకు కధ చెప్పినప్పుడే చాలా బాగుందనిపించింది. కధ కంటే సినిమా ఇంకా బాగా వచ్చింది. నా వీరాభిమానిగా బాబీ ఈ సినిమాని గొప్ప తీయడం కోసం పడుతున్న ఆరాటం, కష్టం చూస్తున్నప్పుడు నాకు అతని మీద అంతకంతకీ ప్రేమ పెరిగిపోతూనే ఉంది. ఈ సినిమాలో రవితేజ ఇంటెర్వెల్ తర్వాత ఎంట్రీ ఇస్తాడు. అతనికి, నాకు మద్య జరిగే పోరాటాలు ప్రేక్షకులని ఉర్రూతలూగిస్తాయి. ఈ సినిమాలో రవితేజ విశ్వరూపం చూపించాడని చెప్పగలను. అంత బాగా నటించాడు. దేవిశ్రీ ప్రసాద్ అద్భుతమైన సంగీతం అందించాడు. ఈ సినిమా కోసం ప్రతీ ఒక్కరూ ఎంతో మనసుపెట్టి కష్టపడి పనిచేశారు. వారందరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను. సంక్రాంతి పండుగకి ఈ సినిమా మంచి విందుభోజనంలా ఉంటుంది,” అని అన్నారు. 

రవితేజ మాట్లాడుతూ, “చిరంజీవి అన్నయ్యతో నా ప్రయాణం విజయవాడ నుంచి మొదలైంది. అది అలా కొనసాగుతూ ఇప్పుడు వాల్తేర్ వీరయ్యవరకు చేరింది. ఆయనతో గడిపిన ప్రతీ క్షణం నాకు ఎప్పటికీ గురుతుంది పోతుంది. ఈ సినిమాతో బాబీ మరో స్థాయికి ఎదిగిపోవడం తధ్యం,” అని అన్నారు. 

దర్శకుడు బాబీ మాట్లాడుతూ, “నాకు చిన్నప్పటి నుంచి మా నాన్నే ఈ సినిమా పిచ్చి, చిరంజీవి పిచ్చి నూరిపోశారు. ఒకప్పుడు చిరంజీవితో ఒక్క ఫోటో దిగితే జన్మ ధన్యమైపోతుందని అనుకొనేవాడిని. అలాంటిది ఆయననే ఇప్పుడు డైరెక్ట్ చేస్తునందుకు నేను ఎంతో సంతోషంగా, గర్వంగా ఫీల్ అవుతున్నా. ఎప్పటికైనా చిరంజీవి సినిమాని డైరెక్ట్ చేస్తానని మా నాన్నకిచ్చిన మాట నిలబెట్టుకొన్నాను. నా  ప్రయాణం వెనుక రవితేజ సహాయసహకారాలు ఎంతగానో ఉన్నాయి. ఈ సినిమాలో రవితేజ చాలా పవర్‌ఫుల్ పాత్ర పోషించారు. ఈ సినిమా చూశాక రవితేజ పాత్ర చాలా అవసరమని అందరూ తప్పక అంగీకరిస్తారు. నాతో సహా ఈ సినిమా కోసం పనిచేసిన ప్రతీ ఒక్కరూ ఈ సినిమాని చిరంజీవికి కానుకగా అందించాలనే తపనతో కష్టపడి, మనసుపెట్టి పనిచేశాము. కనుక ప్రేక్షకులకి తప్పకుండా నచ్చుతుందని ఆశిస్తున్నాను,” అని అన్నారు. 

ఈ సినిమా నిర్మాత నవీన్ యెర్నీని మాట్లాడుతూ, “మా బ్యానర్‌లో ఎప్పటికైనా చిరంజీవితో సినిమా చేయాలనే మా కోరిక ఈ సినిమాతో తీరింది. ఈ సినిమాని ఇంత గొప్పగా తెరకెక్కించినందుకు దర్శకుడు బాబీకి, అద్భుతమైన సంగీతం అందించిన దేవిశ్రీ ప్రసాద్‌కి, ఈ సినిమాలో పనిచేసిన ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను,” అని అన్నారు.