వీరసింహా రెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్‌లో ఎవరేమన్నారంటే...

నటసింహ నందమూరి బాలకృష్ణ, శ్రుతీ హాసన్‌ జోడీగా నటించిన వీరసింహా రెడ్డి ప్రీరిలీజ్ ఈవెంట్‌ నిన్న ఒంగోలులో ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా విచ్చేసిన ప్రముఖ దర్శకుడు బి.గోపాల్ ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు.  

ఈ సందర్భంగా బాలకృష్ణ అభిమానులని ఉద్దేశ్యించి మాట్లాడుతూ, “నటవిశ్వరూపం చూపిన నా తండ్రి ఎన్టీఆర్‌ గొప్పదనం అందరికీ తెలుసు. ఈ సినిమా కోసం మా ఇద్దరి ద్వారా (బాలకృష్ణ, శ్రుతీ హాసన్‌) ఎన్టీఆర్‌, కమల్‌హాసన్‌ డీఎన్ఏలు కలిశాయి. ఇప్పుడు ఫ్యాక్షన్ స్టోరీతో సినిమా అవసరమా?అని కొందరు అడుగుతున్నారు. ఇది కేవలం ఫ్యాక్షన్ సినిమా కాదు. దీని వెనుక రామాయణం, మహాభారతం వంటి కధలున్నాయి. ఆదిత్య 369, భైరవద్వీపం వంటి సినిమాలలాగా ఈ వీరసింహారెడ్డి సినిమా కూడా చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోబోతోంది. నా జీవితాశయం చెంఘీజ్ ఖాన్ సినిమా చేయడం. ఎప్పటికైనా చేస్తాను. ఇంతకాలం సినిమాలతోనే మీ అందరినీ మెప్పించాను. ఇప్పుడు ఓటీటీ వేదిక ద్వారా అన్‌స్టాపబుల్‌ టాక్ షోతో మీ అందరికీ మరింత దగ్గరవగలిగినందుకు నాకు చాలా సంతోషంగా ఉంది,” అని అన్నారు. 

చిత్ర బృందం గురించి మాట్లాడుతూ, “ఒంగోలుకి చెందిన గోపీచంద్ మలినేని నా అభిమాని కనుక ఓ అభిమాని కోరుకొనేవిదంగా ఈ సినిమాని తెరకెక్కించాడు. మాలాంటి ఎందరో నటులకి స్పూర్తి కలిగించే మహానటుడు కమల్‌హాసన్‌. ఆయన కుమార్తె శ్రుతీ హాసన్‌. కానీ ఆమె స్వయంకృషితో ఈ స్థాయికి ఎదిగింది. శ్రుతీ హాసన్‌ మంచి కామెడీ, టైమింగ్ ఉన్న మంచి నటి. ఈ సినిమాలో అద్భుతంగా నటించింది. హనీరోజ్‌కి ఇది మొదటి తెలుగు సినిమా అయినా పాత్రలో పరకాయ ప్రవేశం చేసిన్నట్లు అద్భుతంగా నటించింది,” అని బాలయ్య ప్రశంసించారు. 

ఈ సినిమా దర్శకుడు గోపీచంద్ మలినేని మాట్లాడుతూ, “1999లో సమరసింహారెడ్డి విడుదలైనప్పుడు ఆ సినిమా చూసేందుకు నేను నా 20 మంది ఫ్రెండ్స్ కలిసి సైకిళ్ళపై ఒంగోలుకి వచ్చాము. కానీ అక్కడ థియేటర్‌ వద్ద గొడవ జరిగితే పోలీసులు మా అందరినీ లోపలేశారు. సాయంత్రం విడిచిపెట్టాక అందరం మళ్ళీ థియేటర్‌కి వెళ్ళి సినిమా చూసొచ్చి హాయిగా పడుకొన్నాము. బాలయ్య అభిమానిగా ఆయన సినిమాలు చూసిన నేను, ఇప్పుడు ఆయన సినిమాని డైరెక్ట్ చేస్తుండటం ఎంతో అదృష్టంగా భావిస్తున్నాను. ఈ సినిమా తీస్తున్నప్పుడు దర్శకుడిగా, బాలయ్య అభిమానిగా ఆలోచిస్తూ తీశాను. కనుక ఇది అభిమానుల సినిమా. శ్రుతీ హాసన్‌ నా లక్కీ హీరోయిన్. ఈ సినిమాకి తమన్ అద్భుతమైన సంగీతం అందించారు,” అని అన్నారు.