రాజమౌళి తీసిన సినిమాలు తక్కువే అయినా వేటికవి ఆణిముత్యాలే అని చెప్పుకోవచ్చు. బాహుబలి, ఆర్ఆర్ఆర్ సినిమాలతో జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు సంపాదించుకొన్నారు. తాజాగా న్యూయార్క్ నగరంలో జరిగిన ఓ కార్యక్రమంలో న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ నుంచి ఆర్ఆర్ఆర్ సినిమాకి ఉత్తమదర్శకుడిగా అవార్డు అందుకొన్నారు. తొలిసారిగా ఈ కార్యక్రమంలో రాజమౌళి సతీమణి రమతో సహా కుటుంబసభ్యులందరితో కలిసి ఈ అవార్డు అందుకొన్నారు.
ఈ సందర్భంగా రాజమౌళి మీడియాతో మాట్లాడుతూ, “ఆర్ఆర్ఆర్ సినిమాకి ఇంత ఆదరణ లభించడం నాకు చాలా సంతోషం కలిగిస్తోంది. ఈ వేదికపై నిలబడి ఈ అవార్డు తీసుకొని ఇలా మీ అందరి ముందు నిల్చోని మాట్లాడటం నాకు కాస్త కంగారుగానే ఉంది. నేను చిన్నప్పుడు థియేటర్‌లో సినిమా చూస్తున్నప్పుడు ఎంత గొప్ప అనుభూతిని పొందేవాడినో నాకు ఇంకా గుర్తుంది. కనుక నేను తీసే ప్రతీ సినిమా థియేటర్‌లో కూర్చొని చూసే ప్రేక్షకులకి నచ్చేవిదంగా ఉండాలని తాపత్రయపడుతూ తీస్తుంటాను. ఓ సామాన్య ప్రేక్షకుడు నా సినిమా చూసి ఆనందించినప్పుడే నా సినిమా బాగుందని నేను భావిస్తుంటాను. ఇక్కడ న్యూయార్క్ నగరంలో కూడా థియేటర్‌లో కూర్చొని ఇక్కడి ప్రేక్షకులు కూడా నా సినిమాని ఎంతగా ఆనందించారో కళ్ళారా చూశాను.
దర్శకనిర్మాతలు తమ సినిమాలో పనిచేసినవారందరూ మా కుటుంబ సభ్యులే అని చెపుతుంటారు. కానీ నా సినిమాలకు నిజంగానే నా కుటుంబ సభ్యులందరూ పనిచేస్తుంటారని మీ అందరికీ తెలుసు. ఇక ఈ సినిమాలో ప్రధాన పాత్రలు పోషించిన ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ కూడా మాతో కుటుంబ సభ్యులన్నట్లుగా కలిసిపోయారు. కనుక వారితో సహా ఈ సినిమాలో పనిచేసిన ప్రతీ ఒక్కరికీ ఈ సందర్భంగా మనస్ఫూర్తిగా ధన్యవాదాలు తెలుపుకొంటున్నాను,” అని రాజమౌళి అన్నారు.