వీరసింహారెడ్డి ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ ఒంగోలులోనే కానీ వేరే చోట

బాలకృష్ణ, శ్రుతీ హాసన్‌ జంటగా నటించిన వీరసింహా రెడ్డి సినిమా ఈ నెల 12న విడుదల కాబోతోంది. కనుక రేపు (శుక్రవారం) ఒంగోలులో ఏబీఎం గ్రౌండ్స్‌లో ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ నిర్వహించాలనుకొన్నారు. అయితే ఒంగోలు పోలీసులు ఈ కార్యక్రమాన్ని పట్టణంలోని త్రోవగుంట సమీపంలో అర్జున్ ఇన్ఫ్రా వద్ద గల మైదానంలో నిర్వహించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమానికి బాలకృష్ణ అభిమానులు భారీగా తరలివస్తారు కనుక రైల్వే స్టేషన్‌కి సమీపంలోగల ఏబీఎం గ్రౌండ్స్‌లో నిర్వహించినట్లయితే ట్రాఫిక్ ఇబ్బందులు ఏర్పడుతాయి కనుక అక్కడ నిర్వహించుకొనేందుకు అనుమతి నిరాకరిస్తున్నట్లు తెలియజేశారు. దీంతో నిర్వాహకులు పునరాలోచనలోపడ్డారు. పోలీసులు సూచించిన్నట్లు అర్జున్ ఇన్ఫ్రా వద్ద గల మైదానంలో నిర్వహించుకొనేందుకు ఏర్పాట్లు చేసుకొంటున్నట్లు తెలుస్తోంది.  

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో తెరకెక్కిన వీరసింహారెడ్డి ఈ నెల 12న విడుదల కాబోతోంది. ప్రస్తుతం ఏపీలో అధికార వైసీపీ, ప్రాధాన ప్రతిపక్ష పార్టీ టిడిపిల మద్య రాజకీయ ఆధిపత్యపోరు సాగుతోంది. బాలకృష్ణ హిందూపురం టిడిపి ఎమ్మెల్యేగా ఉన్న సంగతి తెలిసిందే. కనుక ఆయన కూడా జగన్‌ ప్రభుత్వాన్ని విమర్శిస్తుంటారు. తన అన్‌స్టాపబుల్‌ సీజన్‌-2 తొలి ఎపిసోడ్‌లో చంద్రబాబు నాయుడు, నారా లోకేష్‌లతో నిర్వహించారు. తర్వాత వైసీపీ తీవ్రంగా వ్యతిరేకిస్తున్న జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌తో కూడా మరో ఎపిసోడ్‌ నిర్వహించబోతున్నారు. కనుక ఏపీ ప్రభుత్వం వీరసింహారెడ్డి సినిమా ప్రదర్శనకి కూడా ఆటంకాలు కల్పిస్తుందేమో అని దర్శకనిర్మాతలు, బాలయ్య అభిమానులు ఆందోళన చెందుతున్నారు.