కోలీవుడ్ నటుడు అజిత్, మంజూ వారియర్ జంటగా నటించిన తమిళ చిత్రం ‘తునివు’కి తెలుగు డబ్బింగ్ వెర్షన్‌గా వస్తున్న ‘తెగింపు’ ట్రైలర్‌ని సోమవారం విడుదలైంది. అజిత్‌కి వరుసగా రెండు హిట్స్ అందించిన హెచ్.వినోద్ ఈ సినిమాకి కూడా దర్శకత్వం వహించారు. ఓ బ్యాంక్ దోపిడీని కధాంశంగా తీసుకొని రూపొందించిన ఈ సినిమాలో అజిత్ నెగెటివ్ పాత్రలో నటించారు. ట్రైలర్‌లో యాక్షన్ సన్నివేశాలు చూస్తే హాలీవుడ్ సినిమాని తలపించేలా ఉన్నాయి. బోనీ కపూర్, జీ స్టూడియోస్ కలిసి నిర్మించిన ఈ సినిమా సంక్రాంతి పండుగకె విడుదల కాబోతోంది. ప్రముఖ నిర్మాత దిల్‌రాజు కోలీవుడ్ నటుడు విజయ్‌తో ‘వారసుడు’ అనే సినిమా తీసి సంక్రాంతికి విడుదల చేయబోతుండగా ఆ సినిమాకి మరో కోలీవుడ్ హీరో అజిత్ కుమార్ సినిమా, అక్కడ తమిళనాడులో, ఇక్కడ రెండు తెలుగు రాష్ట్రాలలో పోటీగా నిలుస్తుండటం విశేషం.
తెగింపు సినిమాలో సముద్రఖని, అజయ్, జాన్ కొక్కెన్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు. ఈ సినిమాకి నీరవ్ అమిత్ షా ఫోటోగ్రఫీ, జిబ్రాన్ సంగీతం అందించారు. రాధాకృష్ణ ఎంటర్‌టైన్‌మెంట్స్, ఐవీవై ప్రొడక్షన్ సంస్థలు తెగింపు సినిమాని ఏపీ, తెలంగాణ రాష్ట్రాలలో విడుదల చేస్తున్నాయి.
ఈ రెండు తెలుగు డబ్బింగ్ సినిమాలు సంక్రాంతి బరిలో దిగుతున్న చిరంజీవి నటించిన వాల్తేర్ వీరయ్య, బాలకృష్ణ నటించిన వీరసింహారెడ్డి చిత్రాలతో పోటీ పడబోతున్నాయి.