ఎన్టీఆర్‌-కొరటాల సినిమా అప్‌డేట్: సంతోషించాలా బాధపడాలా?

జూ.ఎన్టీఆర్‌ ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా విడుదలైన తర్వాత రామ్ చరణ్‌ శంకర్ దర్శకత్వంలో ఓ సినిమాను చకచకా పూర్తి చేసేస్తుంటే, జూ.ఎన్టీఆర్‌ ఇంతవరకు కొత్త సినిమా మొదలుపెట్టలేదు. ఆర్ఆర్ఆర్‌ తర్వాత కొరటాల శివ దర్శకత్వంలో సినిమా మొదలుపెట్టాల్సి ఉండగా, విదేశాలలో ఆర్ఆర్ఆర్‌ సినిమా ప్రమోషన్స్‌తో కొంతకాలం బిజీగా ఉండగా తర్వాత ఫ్యామిలీతో వెకేషన్‌లో ఉన్నాడు.

ఆచార్య సినిమాతో మెగా డిజాసస్టర్ ఇచ్చినందున తెరుకోవడానికి కొరటాల శివకి కూడా కొంత సమయం పట్టింది. ఈలోగా ముందు అనుకొన్న కధకి మరింత మెరుగులు దిద్ది జూ.ఎన్టీఆర్‌ చేత ఓకే చేయించుకోవడంతో వారిద్దరి కాంబినేషన్‌లో సినిమాకి ప్రీ-ప్రొడక్షన్ పనులు ప్రారంభం అయ్యాయి.

నిన్న నూతన సంవత్సరం సందర్భంగా ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ఫిభ్రవరి నుంచి మొదలవుతుందంటూ ప్రకటించారు. జూ.ఎన్టీఆర్‌ రెండు చేతులలో రెండు కత్తులు పట్టుకొన్న ఓ పోస్టర్‌ను కూడా విడుదల చేశారు. దానిలోనే సినిమా రిలీజ్‌ డేట్ ప్రకటించారు కానీ అది చూసి అభిమానులు తీవ్ర నిరాశకు గురవుతున్నారు. ఈ సినిమాని వచ్చే ఏడాది ఏప్రిల్ 5వ తేదీన విడుదల చేస్తుండటమే ఇందుకు కారణం. కనుక జూ.ఎన్టీఆర్‌ ఈలోగా మరో రెండు సినిమాలైన పూర్తిచేసి విడుదల చేయకపోతే అభిమానులు అసంతృప్తిని చల్లార్చడం కష్టం. 

ఈ సినిమాలో జూ.ఎన్టీఆర్‌కి జోడీగా అలనాటి మేటి నటి శ్రీదేవి కుమార్తె, బాలీవుడ్‌ నటి జాన్వీ కపూర్ నటించబోతున్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. జూ.ఎన్టీఆర్‌ 30వ చిత్రంగా రాబోతున్న దీనిని నందమూరి తారకరామారావు ఆర్ట్స్, యువసుధ ఆర్ట్స్ బ్యానర్లపై సుధాకర్ మిక్కిలినేని, కొసరాజు హరికృష్ణ నిర్మిస్తున్నారు. పవన్‌ కళ్యాణ్‌ సినిమా కోసం నిర్మాత బండ్ల గణేశ్ రిజిస్టర్ చేసుకొన్న ‘దేవర’ టైటిల్ ఈ సినిమాకి ఇచ్చిన్నట్లు సమాచారం కానీ ఈ వార్తని ఖరారు చేయవలసి ఉంది.   

ఈ సినిమాకు కెమెరా: రత్నవేలు, సంగీతం: అనిరుధ్, ఎడిటింగ్: శ్రీకర్ ప్రసాద్, ప్రొడక్షన్ డిజైనర్: సాబు సిరిల్ అందించబోతున్నారు.