నాని... నూతన సంవత్సర శుభాకాంక్షలు వెరైటీగా

నాచురల్ స్టార్ నాని నూతన సంవత్సరం సందర్భంగా తన 30వ సినిమాని అభిమానులకు పరిచయం చేస్తూ వెరైటీగా శుభాకాంక్షలు తెలిపారు. ఓ భవనంపై కూతురు, పెంపుడు కుక్కతో కలిసి కూర్చోన్న నాని కెమెరాతో రాత్రిపూట నగరం అందాలని ఫోటోలు తీస్తుంటే, కూతురు “నాన్నా... నీ గెడ్డం నచ్చలే అంటుంది.  “ఇది దసరా కోసం నాన్నా అయిపోవచ్చింది త్వరలో తీసేస్తా...”అని నాని జవాబిస్తాడు.

“అయితే మీసం కూడా తీసేస్తావా... అంటే అవును మన సినిమాకి ఉండదు అని అంటాడు. తర్వాత కూతురితో ఆప్యాయంగా, నీ విష్ లిస్ట్ ఏమిటో చెప్పు... అంటే నీకు, హీరో ఎవరు కావాలి? హీరోయిన్‌ ఎవరు కావాలి? డైరెక్టర్ ఎవరు కావాలి? అని నాని చెపుతుంటే బ్యాక్ గ్రౌండ్‌లో వరుసగా వారి పేర్లు వస్తుంటాయి.

చివరిలో ఆకాశంలో రంగురంగులతో వెలిగిపోతున్న దీపావళి టపాసుల కాంతులు చూస్తూ “చూశావా మన సినిమాలని ప్రజలు ఎలా సెలబ్రేట్ చేసుకొంటున్నారో... నాని అంటే “ఇట్స్ న్యూ ఇయర్ నాన్న...” అంటూ కూతురు నవ్వుతూ చెప్పడం తర్వాత చక్కటి సందేశంతో టీం #నాని30 అందరికీ నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్పడం చాలా బాగుంది. 

         

శౌర్యూ వి దర్శకత్వంలో తెరకెక్కబోతున్న ఈ సినిమాలో సీతారామం హీరోయిన్‌ మృణాల్ ఠాకూర్ నానికి జోడీగా నటించబోతోంది. వైరా ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై మోహన్ చెరుకూరి, డాక్టర్ తీగల విజయేందర్ రెడ్డి, కెఎస్ మూర్తి కలిసి ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి ఫోటోగ్రఫీ: సను జాన్ వర్గీస్, సంగీతం: హెషమ్ అబ్దుల్ వాహబ్, ఎడిటింగ్: ప్రవీణ్ ఆంటోనీ చేయబోతున్నారు. 

శ్రీకాంత్ ఓదెల దర్శకత్వంలో నాని, కీర్తి సురేశ్ జంటగా చేస్తున్న దసరా సినిమా ఈ ఏడాది మార్చి 30న విడుదల కాబోతోంది. సింగరేణి బొగ్గు కార్మికుల జీవితాల ఆధారంగా తీస్తున్న ఈ సినిమాలో నాని ఓ బొగ్గుగని కార్మికుడిగా చేస్తున్నాడు. దసరా సినిమాలో రాజేంద్ర ప్రసాద్, సముద్రఖని, ప్రకాష్ రాజ్, సాయి కుమార్, జారీనా వాహేబ్, షమ్నా ఖాసీం , రోశన్ మాథ్యూ తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.

 శ్రీ లక్ష్మీ వేంకటేశ్వర సినిమాస్ బ్యానర్‌పై సుధాకర్ చెరుకూరి నిర్మిస్తున్న ఈ సినిమాకు కెమెర: సత్యన్ సూర్యన్, సంగీతం: సంతోష్ నారాయణన్, ఎడిటింగ్: నవీన్ నూలి చేస్తున్నారు.