ప్రభాస్‌ అభిమానులకు న్యూఇయర్ గిఫ్ట్... ప్రాజెక్ట్-కె నుంచి స్క్రాచ్

టాలీవుడ్‌లో అందరి హీరోల సినిమాలు లేదా వాటికి సంబందించిన అప్‌డేట్స్ ఎప్పటికప్పుడు వస్తూనే ఉన్నాయి ఒక్క ప్రభాస్‌వి తప్ప. ఆ మద్యన ఎప్పుడో విడుదల చేసిన ఆదిపురుష్‌ టీజర్‌ ప్రభాస్‌ పరువు తీయడంతో మళ్ళీ ఆ సినిమాకి సంబందించి మరో అప్‌డేట్ ఇవ్వడానికి దర్శకుడు ఓం రౌత్ భయపడుతున్నారు. ఇటీవలే ప్రభాస్‌-మారుతి సినిమా రాజా డీలక్స్ సినిమా షూటింగ్‌ అవుతున్నట్లు ఓ ఫోటో వచ్చింది కానీ మరే సమాచారం లేదు. 

ఇక నాగ్ అశ్విన్ దర్శకత్వంలో ప్రాజెక్ట్-కె సినిమా నిజంగానే చాలా పెద్ద ప్రాజెక్ట్ కావడంతో దాని నుంచి ఎటువంటి అప్‌డేట్స్ రావడం లేదు. దీంతో ప్రభాస్‌ అభిమానులు ఎంతో నిరాశగా ఉన్నారు. ఇటువంటి సమయంలో వారు ఊహించని విదంగా ప్రాజెక్ట్-కె సినిమా నుంచే ఫ్రమ్ స్క్రాచ్: రీ-ఇన్వెంటింగ్ వీల్, ఎపిసోడ్‌-1 పేరుతో వైజయంతీ మూవీస్ ఓ మేకింగ్ వీడియోని విడుదల చేసింది. 

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిన ప్రభాస్‌తో మహానటి దర్శకుడు నాగ్ అశ్విన్ హాలీవుడ్ స్థాయిలో సినిమా తీయడమంటే మాటలు కాదు. నిజంగానే స్క్రాచ్ నుంచి అంటే అతి చిన్నవిషయం నుంచి పని మొదలుపెట్టక తప్పదు. అదే చెపుతూ ఈ వీడియోలో చూపారు. ఈ సినిమా మూడో ప్రపంచయుద్ధం కధాంశంగా తీస్తున్న సినిమా కనుక దానిలో ప్రభాస్‌ వాడబోయే వాహనం భవిష్యత్‌లో ఎప్పుడో వాడబోయే అత్యాధునిక వాహనమై ఉంటుంది. దాని కోసం చిత్ర బృందం ఓ టైరుని డిజైన్ చేసి తయారు చేయడాన్ని ఈవీడియోలో చూపించారు. 

“టైరో.. టైరో.. టైరో... అంటారు.... షో రూమ్‌కి వెళ్తే దండీగా దొరుకుతాయి టైర్లు..” అంటూ ఈ వీడియోకి దర్శకుడు నాగ్ అశ్విన్ కాస్త కామెడీ యాంగిల్ కూడా జోడించడం అలరిస్తుంది. ఈ సినిమాని తెరకెక్కించబోతున్న వైజయంతీ మూవీస్ సంస్థ ప్రభాస్‌ అభిమానులకు నూతన సంవత్సర గిఫ్ట్ గా ఈ వీడియోని విడుదల చేసింది. చూసి మీరూ ఆనందించండి.