మెగాస్టార్ చిరంజీవి ఇవాళ్ళ హైదరాబాద్, చిత్రపురి కాలనీలో సినీ కార్మికులకు నిర్మించిన ఇళ్ళకు ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ, “ప్రతీ సినీ కార్మికుడికి సొంత ఇల్లు ఉండాలని డాక్టర్ ఎన్.ప్రభాకర్ రెడ్డి ఆనాడు చేసిన ఆలోచనకు ప్రతిరూపమే ఈ ఇళ్ళు. ఇందుకు ఆయనకి చేతులెత్తి దణ్ణం పెట్టాలి. దేశంలో మరే సినిమా పరిశ్రమలో కార్మికులకి ఈవిదంగా ఇళ్ళు కట్టించి ఇవ్వలేదు. కనుక సినీ కార్మికులకి ఇళ్ళు కట్టించి ఇవ్వడానికి కృషి చేసిన ప్రతీ ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకొంటున్నాను.
వీటికోసం ఏర్పాటు చేసిన కమిటీ ఏదో అవకతవకలకి పాల్పడిందని ఆరోపణలు నేనూ విన్నాను కానీ వాటి గురించి నాకు తెలియదు కనుక నేను మాట్లాడను. ఈ శుభ సమయంలో డబుల్ బెడ్ రూమ్ ఇళ్ళు పొందిన లబ్ధిదారులందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను.
సి.కళ్యాణ్, తమ్మారెడ్డి భరద్వాజ వంటివారే ఇండస్ట్రీలో పెద్దలు. కానీ వారు నాకంటే చిన్నవాళ్ళమని చెప్పుకోవడానికి నాకు లేని పెద్దరికాన్ని ఆపాదిస్తుంటారు. నాకు సినీ పరిశ్రమలో ఏ పెద్దరికమూ అవసరం లేదు. అవసరమైనప్పుడు ముందుండి సాయపడేందుకు నేను ఎప్పుడూ సిద్దంగానే ఉంటాను. ముఖ్యంగా సినీ కార్మికులకు ఏ కష్టం వచ్చినా ఆదుకొనేందుకు నేను ఎల్లప్పుడూ సిద్దంగా ఉంటాను. ఇండస్ట్రీ నాకు చాలానే ఇచ్చింది. కనుక దానిలో కొంత సినీ కార్మికుల కోసం ఖర్చు చేస్తున్నాను. ఇది నాకు చాలా సంతోషం కలిగిస్తోంది,” అని అన్నారు.