పవన్‌-బాలయ్య అన్‌స్టాపబుల్‌ ఎపిసోడ్ షూటింగ్‌ ఎప్పుడంటే...

నందమూరి బాలకృష్ణ హోస్ట్‌గా ఆహా ఓటీటీలో ప్రసారం అవుతున్న అన్‌స్టాపబుల్‌ సీజన్-2లో ఈసారి పవన్‌ కళ్యాణ్‌ ఎపిసోడ్ ఉంటుందని చాలా రోజులుగా వార్తలు వస్తూనే ఉన్నాయి. ఈరోజు అంటే మంగళవారం ఆ ఎపిసోడ్ షూటింగ్‌ చేయబోతున్నారు. దీని కోసం పవన్‌ కళ్యాణ్‌ హరిహర వీరమల్లు సినిమా షూటింగ్‌కి చిన్న బ్రేక్ ఇచ్చి వచ్చారు. ఈ షో మొదలైనప్పటి నుంచి ప్రతీ షోకి ఇద్దరు అతిధులను ఆహ్వానిస్తున్నారు. కనుక ఈసారి పవన్‌ కళ్యాణ్‌తో పాటు దర్శకులు క్రిష్ పాల్గొనబోతున్నట్లు సమాచారం. మరో దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్‌ కూడా ఈ షో మద్యలో వచ్చి పాల్గొంటారని తెలుస్తోంది. 

బాలకృష్ణ, పవన్‌ కళ్యాణ్‌ ఇద్దరూ ఇటు సినిమాలలో, అటు రాజకీయాలలో ఉన్నారు. ఇద్దరికీ ఉమ్మడి రాజకీయ శత్రువు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దాని అధినేత సిఎం జగన్మోహన్ రెడ్డే. కనుక ఈ షోలో వారిద్దరూ ఏపీ రాజకీయాలపై ఏం బాణాలు సంధించవచ్చు. ఇక ఈ షోలో బాలయ్య వ్యక్తిగత జీవితం గురించి కూడా కొన్ని ప్రశ్నలు అడుగుతుంటారు. కనుక పవన్‌ కళ్యాణ్‌ మూడు పెళ్ళిళ్ళ గురించి అడిగే అవకాశం ఉంది. అప్పుడు పవన్‌ కళ్యాణ్‌ ఏం సమాధానం చెపుతారో చూడాలి. ఈరోజు షూటింగ్ పూర్తయితే రెండు రోజులలోగా ప్రమో విడుదలవుతుంది కనుక ఈ షో ఎలా సాగిందో తెలుస్తుంది. 

బాలకృష్ణ ఇటు రాజకీయాలలో, అటు సినిమాలతో చాలా బిజీగా ఉన్నందున ఈ ఎపిసోడ్‌తో అన్‌స్టాపబుల్‌ సీజన్-2 ముగించబోతున్నట్లు సమాచారం. కానీ ఈ వార్తని ఇంకా ధృవీకరించవలసి ఉంది.