ప్రభాస్-మారుతి రాజా డీలక్స్ చిత్రం అప్పుడే రెండో షెడ్యూల్!

పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోయిన ప్రభాస్‌కి అదే పెద్ద వరంగా, అదే పెద్ద అవరోధంగా కూడా మారిందనే చెప్పాలి. ఎందుకంటే ఇప్పుడు ప్రభాస్‌కి ఉన్న ఆ ఇమేజ్ కారణంగానే నిర్మాతలు వందలకోట్లు పెట్టుబడి పెట్టి సినిమాలు తీసేందుకు వెనకాడటం లేదు. సాహో, రాధేశ్యాం, ఆదిపురుష్, సలార్, ప్రాజెక్ట్-కె చిత్రాలు ఇందుకు నిదర్శనంగా కనిపిస్తున్నాయి. కనుక ఒక్క సినిమా ఫ్లాప్ అయితే నిర్మాతలు భారీగా నష్టపోవడంతో పాటు ఆ ప్రభావం ప్రభాస్‌ తదుపరి సినిమాల మీద కూడా పడుతోంది. కనుక ప్రతీ సినిమాకి రిస్క్ మరింత పెరుగుతుంది. 

ప్రభాస్‌ పాన్ ఇండియా స్టార్‌గా ఎదిగిపోవడంతో తెలుగులో చిన్న సినిమాలు చేయలేని పరిస్థితి నెలకొంది. చిన్న నిర్మాతలకు ప్రభాస్‌తో సినిమాలు తీయడం దాదాపు అసంభవమే. అయితే ఈ ఇమేజ్ చట్రంలో నుంచి బయటపడేందుకు లేదా చిన్న బ్రేక్ ఇచ్చేందుకో ప్రభాస్‌ మారుతి దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నాడు. దానికి రాజా డీలక్స్ అని పేరు ఖరారు చేసినట్లు సమాచారం. 

మారుతి దర్శకత్వంలో ప్రభాస్‌ చేస్తుండటంతో అయన అభిమానులు ఆందోళన చెందుతున్నారు. మారుతి సక్సస్ రేట్ బాగానే ఉన్నప్పటికీ ప్రభాస్‌ స్థాయికి సరిపోయేలా సినిమా తెరకెక్కించగలడా లేదా? అని అనుమానపడుతున్నారు. 

ఈ సినిమాకి ‘రాజా డీలక్స్’ టైటిల్ ఖాయమనుకొంటే అది చాలా వెరైటీగా ఉంది. ఓ సినిమా థియేటర్ చుట్టూ తాతా మనవళ్ళకి ఉన్న అనుబందం కథాంశంగా హర్రర్ జోనర్‌లో తెరకెక్కిస్తునందున ఈ సినిమాలో ప్రభాస్‌ని మారుతి ఏవిధంగా చూపబోతున్నాడో చూడాల్సిందే. 

విశేషమేమిటంటే, ఎటువంటి హంగామా లేకుండా ఈ సినిమా మొదటి షెడ్యూల్ షూటింగ్ ఇప్పటికే పూర్తయింది. రెండో షెడ్యూల్ షూటింగ్ కూడా ప్రారంభమైంది.  

ఈ సినిమాలో ప్రభాస్‌కి జోడీగా మాళవిక మోహన్, నిధి అగర్వాల్‌, రిద్ధీ కుమార్ నటిస్తున్నారు. ప్రభాస్‌కి తాతగా బాలీవుడ్ నటుడు సంజయ్ దత్ నటిస్తున్నట్లు సమాచారం. పీపుల్ మీడియా ఫ్యాక్ట‌రీ, యూవీ క్రియేష‌న్స్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాకి థమన్ సంగీతం అందిస్తున్నారు.