నేనొక నటుడిని... అట్ట కిరీటం పెట్టుకొని... చిరంజీవి షాయరీ

కృష్ణవంశీ దర్శకత్వంలో తెర కెక్కుతున్న రంగమార్తాండ సినిమా కోసం మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్‌లో ఓ కవిత వినిపించారు. నేనొక నటుడిని... చింకిన బట్టలు వేసుకొని... అట్ట కిరీటం పెట్టుకొని... చెక్క కత్తి పట్టుకొని... కాగితపు పూలవర్షంలో కీలుగుర్రంపై స్వారీ చేసే చక్రవర్తిని నేను...” అంటూ చిరంజీవి ధీర గంభీరమైన స్వరంతో నటుల జీవితాల గురించి లక్ష్మీభూపాల వ్రాసిన కవితని ఇళయరాజా స్వరపరిచిన తెలుగు షాయరీని వినిపించారు. ఆ కవితని నేడు కృష్ణవంశీ, చిరంజీవి విడుదల చేయగా సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. మంచి స్పందన వస్తోంది. 

ఈ సందర్భంగా చిరంజీవి ఊహించని విదంగా భావోద్వేగంతో మాట్లాడారు. “ఈ సినిమా కోసం నేను ఈ షాయరీ చెప్పే ముందు నేను చేసిన అనేక సినిమాలలో అనేక పాత్రలను చూపారు. అప్పుడే నాకు సినీ రంగంలో ఎంతో ఎత్తుకి ఎదిగిన నటీనటులు, చివరిలో కష్టాలలో చిక్కుకొన్నవారు నా కళ్ళ ముందు మెదిలారు. ఇంతకాలం నేను, నా సినిమాలు, నా కుటుంబం, అభిమానులు అనుకొంటూ గడిపేశాను. ఆశించిన దాని కంటే ఎక్కువే డబ్బు, కీర్తిప్రతిష్టలు, ప్రజల అభిమానం సంపాదించుకొన్నాను. కానీ ఈ కీర్తి, సినిమా గ్లామర్ శాస్వితమ్ కాదని వ్యక్తిత్వమే శాస్వితం అని గ్రహించాను. నాకు ఈ సమాజం చాలానే ఇచ్చింది కానీ నేను సమాజానికి తిరిగి ఏమిచ్చాను? అని ఆలోచిస్తే ఇచ్చింది చాలా తక్కువే... ఈయాల్సింది... చేయాల్సిందే ఎక్కువ మిగిలి ఉందని గుర్తించాను. కనుక ఇక నుంచి పెద్ద ఎత్తున సామాజిక సేవా కార్యక్రమాలను చేపట్టాలనుకొంటున్నాను,” అని చెప్పి అందరినీ ఆశ్చర్యపరిచారు.

కృష్ణవంశీ సినిమాలంటే తనకు చాలా ఇష్టమని కానీ ఇంతవరకు ఆయన దర్శకత్వంలో పనిచేసే అవకాశం రాలేదన్నారు. ఆయన మంచి కధతో వస్తే ఓ సినిమా చేద్దామని చిరంజీవి అన్నారు. 

రంగమార్తాండలో రాహుల్ సిప్లీ గంజ్, ప్రకాష్ రాజ్, బ్రహ్మానందం, రమ్యకృష్ణ, పోనీ వర్మ, ఆలీ రేజ తదితరులు ముఖ్యపాత్రలలో నటించారు.