మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే!

గోపీచంద్ మలినేని దర్శకత్వంలో నందమూరి బాలకృష్ణ, శృతిహాసన్ జోడీగా జనవరి 12న వస్తున్న పక్కా మాస్ మూవీ వీర సింహారెడ్డి. ఈ సినిమా రిలీజ్‌ డేట్ దగ్గర పడుతుండటంతో దీనిని నిర్మిస్తున్న మైత్రీమూవీ మేకర్స్ నేడు ఓ ఐటం సాంగ్‌ని రిలీజ్‌ చేశారు. బావా...బావా... మా బావ మనోభావాలు దెబ్బతిన్నాయే... అంటూ సాగే ఈ పాటని రామజోగయ్య శాస్త్రి వ్రాయగా, దానికి సంగీత దర్శకుడు తమన్ కిర్రెక్కించే మ్యూజిక్‌తో కంపోజ్ చేశాడు. సాహితి చాగంటి, యామిని, రేణు కుమార్‌ ముగ్గురూ అంతే హుషారుగా పాడారు. ఇక ఈ పాటకి బాలకృష్ణ చేసిన డ్యాన్స్ చూస్తే మతిపోవలసిందే. ఈ ఒక్క డ్యాన్స్ చాలు బాలయ్య అభిమానులకనిపిస్తుంది. అంత బాగా చేశారు. 

 రాయలసీమ ఫ్యాక్షన్ కధాంశంతో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్, లాల్, చంద్రికా రవి తదితరులు కీలకపాత్రలు చేస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై సుమారు రూ.70 కోట్లు భారీ బడ్జెట్‌తో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా, కెమెరా రిషి పంజాబీ, ఎడిటింగ్ నవీన్ నూలి, సంగీతం ఎస్.ధమన్ అందిస్తున్నారు. ఈ సినిమా జనవరి 12న విడుదల కాబోతోంది.