ముఖ్యమంత్రి కెసిఆర్ పై సినిమా

తెలంగాణా ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణా సాధన కోసం చేసిన పోరాటాల ఆధారంగా సినిమా నిర్మించబోతున్నట్లు ప్రముఖ దర్శకుడు మధుర శ్రీధర్ రెడ్డి నిన్న ప్రకటించారు. తెలంగాణా రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా జూన్ 2, 2017లో ఈ సినిమా షూటింగ్ మొదలుపెట్టి, కెసిఆర్ పుట్టిన రోజున ఫిబ్రవరి 17, 2018న సినిమా విడుదల చేయాలనుకొంటున్నట్లు ప్రకటించారు. ‘పెళ్లిచూపులు’ సినిమాని నిర్మించిన నిర్మాత రాజ్ కొండూరి ఈ సినిమా నిర్మిస్తారని శ్రీధర్ రెడ్డి తెలిపారు. 

ఈ సందర్భంగా శ్రీధర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ, “కొంతమంది కెసిఆర్ ని వేర్పాటువాది అంటారు. కొందరు ప్రాంతీయవాదంతో తెలుగు ప్రజల మద్య చిచ్చుపెట్టారని భావిస్తారు. మరికొందరు అయన ప్రజాసామ్య ప్రభుత్వంలో నియంతలాగ వ్యవహరిస్తుంటారని అభిప్రాయపడుతుంటారు. ఇంకొందరు  అయన ఒక వ్యక్తి కాదు ఒక బలమైన శక్తి అని అభిప్రాయపడుతుంటారు. కొందరు ఆయన గొప్ప రాజనీతిజ్ఞుడని భావిస్తుంటారు. నాలుగు కోట్ల తెలంగాణా ప్రజలు మాత్రం ఆయన తమ తెలంగాణా రాష్ట్ర ఏర్పాటు కలలని నిజం చేసిన గొప్ప వ్యక్తి అని భావిస్తుంటారు. ఆయన గురించి ఎవరు ఎన్ని అభిప్రాయాలు కలిగి ఉన్నా ఆయన తన లక్ష్యం మరిచిపోకుండా తన ఆశయసాధనలో విజయం సాధించారు,” అని అన్నారు. 

శ్రీధర్ రెడ్డి తన సినిమాకి ఏవిధంగా ప్రేరణ పొందారో వివరిస్తూ “తెలంగాణా సాధన కోసం 1969 నుంచి జరుగుతున్న పోరాటాలు, బలిదానాల గురించి నాకు మా నాన్నగారు చెప్పినప్పుడు, దాని కోసం కెసిఆర్ నేతృత్వంలో జరిగిన పోరాటాలని చూసినప్పుడు నాలో దర్శకుడు నన్ను నిలువనీయలేదు. తెలంగాణా, సమైక్యాంధ్ర పోరాటాల గురించి చాలా లోతుగా ఆధ్యయనం చేశాను. తెలంగాణా ఉద్యమాల గురించి స్వర్గీయ ఎన్టీఆర్, రాజశేఖర్ రెడ్డి, కెసిఆర్, చంద్రబాబు,సోనియా గాంధీ, వెంకయ్య నాయుడు, ఎల్.కె. అద్వానీ, లగడపాటి రాజగోపాల్, చిరంజీవి, పవన్ కళ్యాణ్ వంటివారి అభిప్రాయల గురించి తెలుసుకొన్నప్పుడు నాకు దానిలో అనేక కోణాలు కనబడ్డాయి. తెలంగాణా సాధనలో ఎదురయిన అనేక సమస్యలు, సవాళ్ళని అధిగమించి కెసిఆర్ తెలంగాణా రాష్ట్రాన్ని సాధించగలిగారు. ఆయన పోరాట స్ఫూర్తి నాకు చాలా ప్రేరణ కలిగించింది. అందుకే ఆయన తెలంగాణా సాధన కోసం చేసిన కృషిని సినిమా రూపంలో ప్రజలకి అందించాలని భావిస్తున్నాను,” అని చెప్పారు.