హరిహర వీరమల్లు లేటెస్ట్ అప్‌డేట్

జాగర్లమూడి క్రిష్ దర్శకత్వంలో పవన్‌ కళ్యాణ్‌, నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమాలో బాలీవుడ్‌ నటుడు సన్నీ డియోల్ వచ్చి చేరారు. ఆయన సెట్‌లోకి అడుగుపెడుతున్న వీడియోని చిత్ర బృందం సోషల్ మీడియాలో షేర్ చేసింది. అలనాటి మేటి హిందీ నటుల్లో ఒకరైన ధర్మేంద్ర కుమారుడే సన్నీ డియోల్. ఆయన ప్రధానంగా యాక్షన్ హీరోగా పేరొందారు. సన్నీ డియోల్ చేసినవి చాలా తక్కువ సినిమాలే అయినా వాటిలో బేతాబ్, అర్జున్, త్రిదేవ్, ఘాయల్, బోర్డర్, దామిని, గదర్, ది హీరో వంటి  అనేక సూపర్ హిట్ సినిమాలు అందించాడు. ఉత్తమ నటుడుగా అనేక జాతీయస్థాయి అవార్డులు అందుకొన్నాడు. కొన్ని సినిమాలకు సన్నీ డియోల్ దర్శకత్వం కూడా చేశారు. సినీ నిర్మాణంలో కూడా పాలుపంచుకొన్నారు. పంజాబ్‌లో గురదాస్‌పూర్ నుంచి 2019 లోక్‌సభ ఎన్నికలలో బిజెపి అభ్యర్ధిగా పోటీ చేసి ఎంపీగా ఎన్నికయ్యారు. 

ఈ సినిమాని హిందీలో కూడా విడుదల చేస్తున్నందున ఉత్తరాది ప్రేక్షకులకి సుపరిచితుడైన సన్నీ డియోల్‌ని తీసుకోవడం కమర్షియల్‌గా చాలా మంచి నిర్ణయమే అని చెప్పవచ్చు. ప్రస్తుతం హరిహర వీరమల్లు షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా సాగుతోంది. ఈ సినిమాలో ఆదిత్య మేనన్, పూజిత పొన్నాడ, బాలీవుడ్‌ నటులు నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు.

హరిహర వీరమల్లు సినిమాకు ఫోటోగ్రఫీ: జ్ఞానశేఖర్ విఎస్, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. రూ.120-200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో తీస్తున్న ఈ సినిమాను మెగా సూర్యా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై ఏ దయాకర్ రావు నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2023 వేసవిలో విడుదల కాబోతోంది.