ప్రముఖ కోలీవుడ్ నటుడు విజయ్ హీరోగా దిల్‌రాజు నిర్మిస్తున్న వారసుడు సినిమాపై వచ్చిన వివాదంలో మరో కోలీవుడ్ నటుడు అజిత్‌కి ఎటువంటి సంబందమూ లేకపోయిన దిల్‌రాజు చేసిన అనుచిత వ్యాఖ్యలతో ఆ ఇద్దరు హీరోల అభిమానుల మద్య తమిళనాడులో, సోషల్ మీడియాలో కూడా చాలా గొడవ జరిగిన సంగతి తెలిసిందే. అజిత్ చేసిన సినిమా ‘తునివు’ తమిళ్ సినిమా కూడా ‘వారిసు’ రిలీజ్ అవుతున్న జనవరి 12వ తేదీనే విడుదలవుతోంది. అజిత్ కంటే విజయ్ గొప్ప హీరో కనుక వారిసు సినిమాకి అదనంగా థియేటర్లు ఇవ్వాలని దిల్‌రాజు అనడమే ఆ గొడవలకి కారణం.
అజిత్ తమిళంలో చేసిన తునివుని తెలుగులో తెగింపు పేరుతో అదే రోజున విడుదలచేయాలని ఆ సినిమా దర్శక నిర్మాతలు నిర్ణయించడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో కూడా సంక్రాంతికి విడుదలవుతున్న వాల్తేర్ వీరయ్య, వీరసింహారెడ్డి, వారసుడు, తెగింపు సినిమాలకి థియేటర్లు సర్దుబాటు చేయాల్సి ఉంటుంది. నాలుగు సినిమాలు జనవరి 12,13 తేదీలలో విడుదలవుతున్న సంగతి తెలిసిందే.
కోలీవుడ్‌లో అజిత్-దర్శకుడు వినోద్ కాంబినేషన్‌లో వరుసగా వచ్చిన రెండు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. కనుక ఇప్పుడు ఈ మూడో సినిమా తెగింపుపై చాలా భారీ అంచనాలే ఉన్నాయి. కనుక రెండు తెలుగు రాష్ట్రాలలో కోలీవుడ్ హీరోలిద్దరి మద్యనే కాకుండా వారిద్దరి సినిమాలతో బాలయ్య, చిరంజీవి సినిమాలకి కూడా గట్టి పోటీ ఉంటుందన్న మాట!