
అలనాటి మేటి నటులలో ఒకరైన కైకాల సత్యనారాయణ (87) శుక్రవారం తెల్లవారుజామున 4 గంటలకి హైదరాబాద్‌లో తన నివాసంలో కన్ను మూశారు. గత కొంతకాలంగా ఆయన వృద్ధాప్య సంబందిత ఆరోగ్య సమస్యలతో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. ఆయన మృతిపట్ల తెలుగు సినీ పరిశ్రమలో అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు.
కైకాల సత్యనారాయణ స్వస్థలం కృష్ణాజిల్లా కౌతారం గ్రామం. 1935, జూలై 25న జన్మించారు. గుడివాడలో డిగ్రీ చదువుతున్న రోజులలోనే ఎన్నో నాటక ప్రదర్శనలు చేశారు. ఆయన ప్రతిభని గుర్తించిన నిర్మాత డీఎల్ నారాయణ ‘సిపాయి కూతురు’ సినిమా(1959) లో సత్యనారాయణకి అవకాశం ఇవ్వడంతో సినీరంగంలో ప్రవేశించారు. అయితే అది హిట్ కాలేదు కానీ ఆ సినిమాతోనే ఆయన ఎన్టీఆర్ దృష్టిలో పడ్డారు. ఎన్టీఆర్ తన ‘అపూర్వ సహస్ర శిరచేద చింతామణి’ సినిమా (1960)లో అవకాశం ఇచ్చారు. దానిలో చేసిన తర్వాత కైకాల మరి వెనుతిరిగి చూసుకోలేదు.
సాంఘికం, జానపదం, పౌరాణికం.... ఏ సినిమాలలో ఎటువంటి పాత్రలోనైనా అవలీలగా నటించి తెలుగు ప్రజలని మెప్పించిన మహానటుడు కైకాల సత్యనారాయణ. ఆయన 1959 నుంచి 2019 వరకు సుమారు 750కి పైగా సినిమాలలో నటించారు. అలనాటి మేటి నటులు ఎన్టీఆర్, ఏఎన్ఆర్, ఎస్వీ రంగారావు, కృష్ణ, శోభన్ బాబు వంటివారందరితో ఆయన కలిసి నటించారు. ఆరోజుల్లో పౌరాణిక పాత్రలలో ఎన్టీఆర్, ఎస్వీ రంగారావులకి ధీటుగా చేయగల ఏకైక నటుడు కైకాల సత్యనారాయణ మాత్రమే అని అనిపించుకొన్నారు.
సత్యనారాయణ చేసిన చాలా సినిమాలు సూపర్ హిట్స్. వాటిలో శ్రీకృష్ణార్జున యుద్ధం, లవకుశ, నర్తనశాల, పాండవ వనవాసం, శ్రీకృష్ణ పాండవీయం, పరమానంద శిష్యులు, చిక్కడు దొరకడు, నిండు మనసులు, భలే రంగడు, ఏకవీర, ప్రేమ నగర్, తాతా మనవడు, పాపం పసివాడు, డబ్బుకు లోకం దాసోహం, యమగోల, జీవనజ్యోతి, సోగ్గాడు, అడవిరాముడు, దానవీర శూరకర్ణ, సిరిసిరి మువ్వ, వేటగాడు ఇలా చెప్పుకొంటూపోతే చాలానే ఉన్నాయి. చివరిగా 2019లో మహేష్ బాబు హీరోగా వచ్చిన మహర్షి సినిమాలో నటించారు.
ఆయన ప్రతిభకి జాతీయస్థాయిలో సరైన గుర్తింపు లభించలేదనే చెప్పాలి. కైకాలకి లైఫ్ టైమ్ అచీవ్‌మెంట్ అవార్డ్ (2017), బెస్ట్ ఫీచర్ ఫిల్మ్ బంగారు కుటుంబం (1994), రగుపతి వెంకయ్య అవార్డు (2011) అందుకొన్నారు. ఇవికాక నటశేఖర, కళాప్రపూర్ణ బిరుదులతో సన్మానించబడ్డారు.
కైకాల 1996లో టిడిపి ద్వారా రాజకీయాలలో ప్రవేశించి మచిలీపట్నం నుంచి లోక్‌సభకి ఎన్నికయ్యారు. కైకాల సత్యనారాయణ అంత్యక్రియలు శనివారం ఉదయం జూబ్లీహిల్స్‌లో మహాప్రస్థానంలో నిర్వహిస్తామని ఆయన కుటుంబ సభ్యులు తెలిపారు.