
రాజమౌళి దర్శకత్వంలో జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోలుగా విజయవంతమైన ఆర్ఆర్ఆర్ సినిమాలో ‘నాటు నాటు...’ పాట ఆస్కార్ అవార్డుల నామినేషన్స్ కోసం ఎంపిక చేసిన నాలుగు చిత్రాలలో ఒకటిగా నిలవడంతో ఇప్పుడు మళ్ళీ అందరి దృష్టి ఆ పాట, వారి డ్యాన్స్ పై పడింది. ఈ సందర్భంగా దర్శకుడు రాజమౌళి ఆ పాట అంత పెర్ఫెక్టుగా రావడం కోసం తామందరం ఎంతగా శ్రమ పడ్డారో తెలియజేశారు.
సినిమాలో అన్ని పాటలకీ భిన్నంగా ఉండే ఓ పాట కావాలని కోరితే చంద్రబోస్ తేటతెలుగు పదాలతో ఈ పాటని అందించారని, అలాగే కీరవాణి దానికి అద్భుతమైన సంగీతం అందించారని రాజమౌళి చెప్పారు. ఈ రెండో ఓ ఎత్తైతే ఆ పాటకి కొరియోగ్రఫీ మరో ఎత్తని రాజమౌళి చెప్పారు. దానికి కొరియోగ్రఫీ చేసిన ప్రేమ్ రక్షిత్, దానిలో కీలకమైన ‘హుక్ స్టెప్’ అంటే... జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ ఇద్దరూ ఒకరి భుజాలపై మరొకరు చేతులు వేసుకొని కాళ్ళు కదుపుతూ చేసే స్టెప్ కోసం 80 రకాలుగా ప్రయత్నించారని రాజమౌళి చెప్పారు. చివరికి ఇప్పుడు మనం చూస్తున్న సెత్ప్ అందరికీ ఓకే అయ్యాక, దానిని తాను ఓకే చేసేందుకు మళ్ళీ జూ.ఎన్టీఆర్, రామ్ చరణ్ 18 టేకులు తీసుకొన్నారని రాజమౌళి చెప్పారు.
దేశంలోనే అత్యుత్తమ డ్యాన్సర్స్ అయిన వారే ఈ ఒక్క స్టెప్పుకి 18 టేకులు తీసుకొన్నారంటే వారెంత కష్టపడ్డారో అర్దం చేసుకోవచ్చు. చివరికి వారందరి శ్రమకి గుర్తింపుగా ఆ పాట ఆస్కార్ నామినేష న్స్‌కి షార్ట్ లిస్ట్ అయ్యింది. అవార్డు కూడా సాధిస్తే వారి శ్రమకి తగిన ఫలితంకూడా దక్కుతుంది.
ఈ జాబితాలో భారత్ నుంచి నాలుగు చిత్రాలు ఎంపికయ్యాయి. జనవరి 12 నుంచి 17వరకు ఇటువంటి జాబితాలను జ్యూరీ సభ్యులు మరోసారి పరిశీలించి వాటిలో నుంచి అత్యుత్తమైన వాటిని ఆస్కార్ అవార్డు నామినేషన్స్‌కి ఎంపిక చేస్తారు. మార్చి 12 జరిగే ఆస్కార్ అవార్డ్స్ కార్యక్రమంలో విజేతలకి అవార్డులు అందిస్తారు.