కనెక్ట్ సినిమా ప్రమోషన్స్‌కి హాజరైన నయనతార

దక్షిణాది సినీ పరిశ్రమలో లేడీ సూపర్ స్టార్ అని పేరున్న నయనతార సాధారణంగా తాను నటించిన సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనరు. తనతో సినిమా చేయాలనుకొని వచ్చే దర్శకనిర్మాతలకి ఆమె ముందే ఈ షరతు విధిస్తుంటారు. కనుక చాలామంది దర్శకనిర్మాతలు ఆమెకి బదులు వేరే హీరోయిన్ని పెట్టుకొంటారు. కానీ కొందరు మాత్రం తమ సినిమాలో ఆ పాత్రని ఆమె మాత్రమే చేయాలని లేదా చేయగలరని గట్టిగా నమ్మేవారే ఆ షరతుకి అంగీకరించి ఆమెను తమ సినిమాలోకి తీసుకొంటారు. మెగాస్టార్ చిరంజీవి నటించిన గాడ్ ఫాదర్‌ చిత్రంలో నయనతార నటించినప్పటికీ ఆమె ఆ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనలేదని అందరికీ తెలిసిందే. 

అయితే ఆమె తన భర్త విగ్నేష్ శివన్ దర్శకత్వంలో చేసిన కనెక్ట్ సినిమా ప్రమోషన్స్‌లో పాల్గొనడం విశేషం. బహుశః తన భర్త రౌడీ పిక్చర్స్ బ్యానర్‌పై నిర్మించారు కనుకనే అది తమ సొంత సినిమాగా భావించి ప్రమోషన్స్‌లో పాల్గొని ఉండవచ్చు. ఈ సినిమాకి అశ్విన్ శరవణన్ దర్శకత్వం వహించారు.

ఈ సినిమాలో నయనతార, సత్యరాజ్, అనుపమ్ ఖేర్, హానియా నసీఫా ప్రధాన పాత్రలు చేశారు. ఈ సినిమాలో నయనతార తండ్రిగా సత్యరాజ్, ఆమె కుమార్తెగా హానియా నసీఫా నటించారు. లాక్‌డౌన్‌కి ముందు వారందరూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నట్లు చూపారు. లాక్‌డౌన్‌ మొదలైన తర్వాత వేర్వేరు ప్రాంతాలలో వారందరూ ఉన్నప్పుడు నయన్ కూతురికి దెయ్యం పడుతుంది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా ఎవరూ ఆమెకి సహాయపడలేని పరిస్థితి నెలకొంటుంది. 

అప్పుడు దెయ్యాలను వదిలించే వ్యక్తిగా బాలీవుడ్‌లో సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఎంట్రీ ఇస్తారు. కానీ ఆయన కూడా నయన్ కూతురు వద్దకు వెళ్ళలేని పరిస్థితిలో వీడియో కాలింగ్ ద్వారా ఆమెకి ఏవిదంగా నయం చేశాడనేదే కధ. 

ఇటువంటి హర్రర్ సినిమాలకి సంగీతం, ఫోటోగ్రఫీ అతి ముఖ్యమైనవని అందరికీ తెలుసు. ట్రైలర్‌ చూస్తే సంగీత దర్శకుడు పృధ్వీ చంద్రశేఖర్‌, సినిమాటోగ్రాఫర్ మణికంఠన్ కృష్ణమాచారి సినిమాకి కావలసిన అద్భుతమైన ఎఫెక్ట్ అందించినట్లు అర్దం అవుతోంది. ఇక ఈ కనెక్ట్ సినిమా మరో ప్రత్యేకత ఏమిటంటే దీని నిడివి కేవలం 99 నిమిషాలే కనుక మద్యలో ఇంటర్వెల్ ఉండదు! ఈ సినిమా గురువారం ప్రపంచవ్యాప్తంగా విడుదల కాబోతోంది.