విజయ్‌ ఆంటోనీ బిచ్చగాడు సీక్వెల్‌.. వేసవిలో విడుదల

విజయ్‌ ఆంటోనీ ప్రధానపాత్రలో 2016లో ఎటువంటి అంచనాలు లేకుండా విడుదలైన బిచ్చగాడు చిత్రం ఆ సినిమా నిర్మాతలకి కనకవర్షం కురిపించింది. ఆ ఒకే ఒక్క సినిమాతో విజయ్‌ ఆంటోనీ కోలీవుడ్‌ అగ్రహీరోలలో ఒకడైపోయాడు. ఓ సినిమా సూపర్ హిట్ అయితే దానికి సీక్వెల్‌ తీస్తుండటం సహజమే. కనుక బిచ్చగాడు సినిమాకి కూడా సీక్వెల్‌ సిద్దమవుతోంది. బిచ్చగాడు-2లో విజయ్‌ ఆంటోనీ నటించడమే కాకుండా దర్శకత్వం, సంగీతం, ఎడిటింగ్ బాధ్యతలు కూడా స్వయంగా చూసుకొంటుండటం విశేషం. ఈ సినిమాని విజయ్‌ ఆంటోనీ ఫిల్మ్ కార్పొరేషన్ బ్యానర్‌పై ఫాతిమా ఆంటోనీ నిర్మిస్తున్నారు. అంటే ఇది పూర్తిగా సొంత చిత్రమే అన్నమాట!

బిచ్చగాడు-2లో విజయ్‌ ఆంటోనీకి జంటగా కావ్య థాపర్ నటిస్తోంది. తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం, హిందీ భాషల్లో నిర్మిస్తున్న ఈ సినిమా షూటింగ్‌ దాదాపు పూర్తయింది. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులు మొదలుపెట్టి వచ్చే వేసవిలో విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నామని విజయ్‌ ఆంటోనీ తెలిపారు. ఈ సందర్భంగా బిచ్చగాడు-2 పోస్టర్‌ కూడా విడుదల చేశారు. దానిలో విజయ్‌ ఆంటోనీ ‘యాంటీ బికిలి’ అని వ్రాసున్న ఎరుపు గుడ్డని కళ్ళకి కట్టుకొన్నట్లు చూపారు. త్వరలో ఈ సినిమా టీజర్ విడుదల చేస్తామని విజయ్ ఆంటోనీ తెలిపారు.  

ఈ సీక్వెల్‌ సినిమాలో దేవ్ గిల్, జాన్ విజయ్, మన్సూర్ ఆలీ ఖాన్, రాజా కృష్ణమూర్తి, హరీష్ పెరడి, రాధా రవి, వైజీ మహేంద్రన్, తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు. ఈ చిత్రానికి ఫోటోగ్రఫీ: విజయ్‌ మిల్టన్, కధ, సంగీతం, ఎడిటింగ్, దర్శకత్వం: విజయ్‌ ఆంటోనీ అందిస్తున్నారు.