ఆరోజు నాకోసం పవన్‌ కళ్యాణ్‌ వచ్చిన సంగతి ఎవరికీ తెలీదు: అలీ

ప్రముఖ హాస్య నటుడు అలీ ఈటీవీ ఛానల్‌లో గత ఆరేళ్ళుగా ‘ఆలీతో సరదాగా’ అనే కార్యక్రమం విజయవంతంగా నిర్వహిస్తున్నారు. ఈ ఆరేళ్ళలో 309 ఎపిసోడ్స్ చేయడంతో అలీ ఈ షో నుంచి కొంతకాలం బ్రేక్ తీసుకోవాలనుకొన్నారు. కానీ ఈ షోకి వస్తున్న అపూర్వ స్పందన చూసి ఈటీవీ యాజమాన్యం మళ్ళీ అలీ తిరిగివచ్చే వరకు ఈ షోని యాంకర్ సుమతో యదాతధంగా కొనసాగించాలని నిర్ణయించింది. ఇంతకాలం ఎంతో మంది ప్రముఖులని ఈ షోలో ఇంటర్వ్యూ చేసిన అలీని సోమవారం రాత్రి ప్రసారమైన ఈ షోలో సుమ ఆయనని ప్రశ్నించడం విశేషం. ఈ సందర్భంగా అలీ తన వ్యక్తిగత, సినీ జీవితం గురించి చాలా మందికి తెలియని అనేక విశేషాలు చెప్పారు. 

వాటి గురించి ఇక్కడ చెప్పుకోవడం కంటే ఆ షోని చూస్తేనే అర్దవంతంగా ఉంటుంది. ఇతీవల అలీకి, పవన్‌ కళ్యాణ్‌కి మద్య దూరం పెరిగినట్లు వచ్చిన వార్తల గురించి, ఆలీ అల్లుడికి వందల కోట్లు ఆస్తులున్నాయంటూ వచ్చిన వార్తల గురించి సుమ ప్రశ్నించగా అలీ చాలా ఆసక్తికరమైన విషయాలు చెప్పారు. 

పవన్‌ కళ్యాణ్‌తో నాకు దూరం ఏర్పడలేదు. కొన్ని వెబ్‌సైట్స్ తమ రేటింగ్ కోసం అలా వ్రాసుకొన్నాయి అంతే. నేను మా పాప పెళ్ళి శుభలేఖ ఇవ్వడానికి షూటింగ్ స్పాట్‌కి వెళ్తే ఆయన వేరే ఎవరితోనో మాట్లాడుతున్నారు. వారిని వెయిట్ చేయమని చెప్పి పవన్‌ కళ్యాణ్‌ నా దగ్గరకి వచ్చి కార్డ్ తీసుకొని తప్పకుండా పెళ్ళికి వస్తానని చెప్పారు. పవన్‌ కళ్యాణ్‌ హైదరాబాద్‌ నుంచి మా పాప పెళ్ళికి బయలుదేరినప్పుడు ఫ్లైట్ మిస్ అయ్యింది దాంతో ఆయన రాలేకపోయారు. అదే విషయం ఆయన వెంటనే నాకు ఫోన్‌ చేసి చెప్పి తర్వాత తప్పకుండా వచ్చి వధూవరులని దీవిస్తానని చెప్పారు. ఈ విషయాలు ఎవరికీ తెలియదు. కనుక ఎవరికి తోచిన్నట్లు వారు వ్రాసేసుకొన్నారు,” అని అలీ చెప్పారు. 

అల్లుడికి వందల కోట్ల ఆస్తులునట్లు సుమ అడిగిన ప్రశ్నకి అలీ సమాధానం చెపుతూ, “మా అల్లుడు అమెరికాలో సిబిఎస్ ఫార్మా కంపెనీలో రోబోటిక్ ఇంజనీరుగా చేస్తున్నాడు. అతని తండ్రి, అన్నా, వాడిన, చెల్లెలు, ఆమె భర్త అందరూ డాక్టర్లే. కనుక బాగా స్థిరపడినవారే. అయితే మేము వారిది చాలా మంచి కుటుంబమని తెలుసుకొని మా అమ్మాయిని ఇచ్చాము. ఆస్తులు చూసి కాదు. నేను ఇండస్ట్రీలో బాగానే సంపాదించుకొన్నాను. కనుక మా అమ్మాయికి మేము ఇవ్వగలిగినంతా ఇచ్చాము. అది సహజమే కదా?” అని అలీ అన్నారు.