
అల్లరి నరేష్, ఆనంది జంటగా నటించిన ఇట్లు మారేడుమిల్లి ప్రజానీకం సినిమా నవంబర్ 25న థియేటర్లలో విడుదలైంది. తెలుగు ఉపాధ్యాయుడుగా చేస్తున్న అల్లరి నరేష్ ఓ మారుమూల గ్రామమైన మారేడుమిల్లిలో ఎన్నికల నిర్వహణ డ్యూటీకి వెళ్తాడు. అక్కడి ప్రజలు తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు పట్టించుకోకపోవడంతో నిరసనగా ఎన్నికలని బహిష్కరించాలని నిర్ణయం తీసుకొంటారు. అప్పుడు అల్లరి నరేష్ వారికి నచ్చజెప్పి ఎన్నికలలో పాల్గొనేలా చేస్తాడు. ఆ తర్వాత కొందరు ఎన్నికల అధికారిని కిడ్నాప్ చేసి, బ్యాలెట్ బాక్సులను ఎత్తుకుపోవడంతో కధ మలుపు తిరుగుతుంది. ఎన్నికల నేపధ్యం తీసుకొని మారుమూల గ్రామాలలో ప్రజలు ఎటువంటి సమస్యలను ఎదుర్కొంటున్నారో దర్శకుడు ఏఆర్. మోహన్ చాలా చక్కగా చూపించారు. కానీ తెలుగు ప్రేక్షకులకి ఈ సినిమా అంతగా నచ్చలేదు. ఇప్పుడు ఈ సినిమా జీ-5 ఓటీటీలో డిసెంబర్ 23 నుంచి ప్రసారం కాబోతోందని ఆ సంస్థ సోషల్ మీడియాలో ప్రకటించింది. ఈ సినిమాలో వెన్నెల కిషోర్, ప్రవీణ్, సంపత్ రాజు, రఘుబాబు, శ్రీతేజ్ తదితరులు ముఖ్యపాత్రలు చేశారు.
హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండు నిర్మిచిన ఈ సినిమాకి కూర్పు: రామిరెడ్డి, ఫోటోగ్రఫీ: ఛోటా కె ప్రసాద్, సంగీతం: సాయి చరణ్ పాకాల అందించారు.