మెగాస్టార్ చిరంజీవి, బాబీ కాంబినేషన్‌లో వస్తున్న వాల్తేర్ వీరయ్య సినిమా సెకండ్ సింగిల్ కొద్ది సేపటి క్రితం విడుదలైంది. నువ్వు సీతవైతే... నేను రాముడినౌతా... నువ్వు శ్రీదేవివైతే... నేనే చిరంజీవంటా.... అంటూ సాగే లిరికల్ వీడియో చాలా హుషారుగా సాగింది.
ఈ పాటని ఈ నెల 12వ తేదీన ఫ్రాన్స్‌లో షూటింగ్ చేసామని చిరంజీవి స్వయంగా ఇదివరకే తెలియజేస్తూ ఆ లొకేషన్ ఫోటో, వీడియో అభిమానులతో షేర్ చేసుకొన్నారు. స్విట్జర్ లాండ్‌కి ఇటలీ దేశాలకి మద్య ఆల్ప్స్ పర్వతశ్రేణి వద్ద ఓ లోయలో ఉందని అక్కడ ఈ పాట షూటింగ్ పూర్తి చేశామని చెప్పారు.
దట్టమైన మంచుకురుస్తుండగా ఈ పాటని షూటింగ్ చేయడం కోసం అందరూ చాలా శ్రమించామని తెలిపారు. అయితే అక్కడి అందాలు చూసి ముగ్దుడినైపోయానని అందుకే ఆ లోకేషన్ వీడియోని మీతో షేర్ చేసుకొంటున్నానని చిరంజీవి చెప్పారు. మీ అందరినీ అలరించడం కోసం ఆ మంచులో అందరం చాలా కష్టపడ్డామని చెప్పారు. మైనస్ 8 డిగ్రీల చలిలో ఇద్దరం డ్యాన్స్ చేయడానికి చాలా కష్టపడ్డామని చెప్పారు.
ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా శ్రుతీ హాసన్ నటిస్తోంది. మాస్ మహారాజ రవితేజ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, కేథరిన్ ధెరిసా, బాబీ సింహా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
వాల్తేర్ వీరయ్య సినిమాకి దర్శకుడు బాబీ కధ, డైలాగ్స్ అందించగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకి కెమెరా: ఆర్దర్ ఏ విల్సన్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు. వాల్తేర్ వీరయ్య సినిమా సంక్రాంతి పండుగ సందర్భంగా జనవరి 13న విడుదల కాబోతోంది.