పవన్‌ అభిమానులకి ఈ వార్త పండగే!

పవర్ స్టార్ పవన్‌ కళ్యాణ్‌ ప్రస్తుతం క్రిష్ జాగర్లమూడి దర్శకత్వంలో హరిహర వీరమల్లు సినిమా పూర్తి చేస్తున్న సంగతి తెలిసిందే. దాని తర్వాత హరీష్ శంకర్ దర్శకత్వంలో ఉస్తాద్ భగత్ సింగ్, సుజీత్ దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. మరోపక్క పవన్‌ కళ్యాణ్‌ జనసేన పార్టీతో రెండు తెలుగు రాష్ట్రాలలో రాజకీయాలలో ఉన్నందున వచ్చే ఎన్నికలకి పార్టీని సిద్దం చేసుకొనేందుకు పెద్దగా సమయం లేదు. కనుక హరిహర వీరమల్లు చిత్రం పూర్తికాగానే హరీష్ శంకర్, సుజీత్ సినిమాలను ఒకేసారి మొదలుపెట్టి ఒకేసారి పూర్తిచేయాలని పవన్‌ కళ్యాణ్‌ నిర్ణయించుకొన్నట్లు తాజా సమాచారం. అందుకు తగ్గట్లుగా రెండు సినిమాలకి ప్రీ-ప్రొడక్షన్ పనులు కూడా జోరుగా సాగుతున్నాయి. 

ఈ రెండు సినిమాల తర్వాత మరో సినిమాకి కూడా పవన్‌ కళ్యాణ్‌ గ్రీన్ సిగ్నల్‌ ఇచ్చేసినట్లు తెలుస్తోంది. అదే... తమిళంలో సూపర్ హిట్ అయిన వినోదయ సిత్తం. దీనికి తమిళంలో సముద్రఖని దర్శకత్వం వహించారు. పవన్‌ కళ్యాణ్‌ చేయబోయే తెలుగు రీమేక్‌కి కూడా సముద్రఖనే దర్శకత్వం చేయబోతున్నారు. ఈ సినిమాకి త్రివిక్రం శ్రీనివాస్‌ డైలాగ్స్ వ్రాయబోతున్నట్లు తెలుస్తోంది. 

నిజానికి ఈ సినిమా చేయాలని పవన్‌ కళ్యాణ్‌ అనుకొన్నప్పటికీ రాజకీయాలు, సినిమా షూటింగులతో తీరిక లేకపోవడం వలన ఇంతకాలం వాయిదావేస్తున్నారు. ఇప్పుడు దీనినీ వచ్చే వేసవిలోగా పూర్తిచేసేసి, మళ్ళీ ఏపీ, తెలంగాణ శాసనసభ ఎన్నికలు పూర్తయ్యేవరకు పవన్‌ కళ్యాణ్‌ సినిమాల నుంచి బ్రేక్ తీసుకోవాలనుకొంటున్నట్లు సమాచారం. అంటే వచ్చే ఏడాదిలో వరుసగా నాలుగు పవన్‌ కళ్యాణ్‌ సినిమాలు విడుదల కాబోతున్నాయన్న మాట! పవన్‌ కళ్యాణ్‌ అభిమానులకి పండగే కదా మరి!