
రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ హీరోలుగా విడుదలైన ఆర్ఆర్ఆర్ సినిమా కలక్షన్స్ గురించి మాట్లాడుకొనే సమయం ముగిసింది. ఇప్పుడు అది అందుకొంటున్న అందుకోబోతున్న అవార్డుల గురించే మాట్లాడుకొంటున్నారు. ఆర్ఆర్ఆర్‌కి ఇప్పటికే న్యూయార్క్ ఫిల్మ్ క్రిటిక్స్ అవార్డు అందుకొన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు మరో రెండు అవార్డులకి నామినేట్ అయ్యింది. గోల్డెన్ గ్లోబ్ అవార్డ్-2023లో ఉత్తమ ఆంగ్లభాషేతర చిత్రంగాను, ఉత్తమ సంగీత దర్శకుడు విభాగంలోను ఆర్ఆర్ఆర్ రెండు అవార్డులకి నామినేట్ అయ్యింది.
ఇవిగాక లాస్ ఏంజలెస్ ఫిల్మ్ క్రిటిక్స్ అసోసియేషన్ ఆర్ఆర్ఆర్‌కి బెస్ట్ మ్యూజిక్ కేటగిరీలో అవార్డు ప్రకటించింది. ఆ సినిమాలో రామ్ చరణ్, జూ.ఎన్టీఆర్ కలిసి చేసిన నాటునాటు డ్యాన్స్ ఎంత పాపులర్ అయ్యిందో తెలుసు. ఆ పాటకి సంగీతం అందించిన ఎంఎం కీరవాణి ఉత్తమ సంగీత దర్శకుడిగా ఎంపికచేసింది.
బోస్టన్ సొసైటీ ఆఫ్ ఫిల్మ్ క్రిటిక్స్ కూడా కీరవాణికి బెస్ట్ ఒరిజినల్ స్కోర్ వినర్ అవార్డుని ప్రకటించింది. వీటన్నిటిలో ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డులకి నామినేట్ అవడం ఆర్ఆర్ఆర్ బృందానికి చాలా సంతోషం కలిగిస్తోంది. జూ.ఎన్టీఆర్ తన ఆనందాన్ని ట్విట్టర్‌లో అభిమానులతో పంచుకొన్నారు.