కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో మెగాస్టార్ చిరంజీవి, శ్రుతీ హాసన్ జంటగా తెరకెక్కుతున్న వాల్తేర్ వీరయ్య ఈ సినిమాలో మారో మాస్ మహారాజ్ రవితేజ కూడా ప్రధాన పాత్ర చేస్తున్నాడు. మొన్న ఫస్ట్-లుక్ పోస్టరులో చెప్పినట్లుగానే ఈరోజు ఉదయం 11.07 గంటలకి ఆ సినిమాలో రవితేజని పరిచయం చేస్తూ టీజర్ విడుదల చేసింది మైత్రీ మూవీ మేకర్స్.
టీజర్ రవితేజ మాస్ ఇమేజికి తగ్గట్లుగానే ఉంది. ఓ చేత్తో మేకపిల్లని పట్టుకొని మరోచేత్తో గొడ్డలితో గ్యాస్ సిలెండర్ ఈడ్చుకొని వస్తున్నట్లు మొన్న ఫస్ట్-లుక్‌లో చూపగా, ఇవాళ్ళ విడుదలైన టీజర్‌లో ‘ఫస్ట్ టైమ్ ఓ మేకపిల్లని ఎత్తుకొని పులి వస్తుండాది...” అనే డైలాగ్ “ఏంరా వారీ ఇంకా పిసపిస జేస్తుండావ్ నీకింకా సమాజ్ కాలే...” అంటూ రవితేజ స్టైల్లో చెప్పిన డైలాగ్స్, ఫైట్స్ అభిమానులను ఆకట్టుకొనేలా ఉన్నాయి.
ఈ సినిమాలో కేథరిన్ థెరీసా, రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కృషోర్, బాబీ సింహా ముఖ్యపాత్రలు చేస్తున్నారు. బాలీవుడ్‌లో భామ ఊర్వశీ రౌతేలతో “బాస్ పార్టీ...” అంటూ మెగాస్టార్ చిరంజీవి చేసిన డ్యాన్స్ కి మంచి స్పందనవస్తోంది.
వాల్తేర్ వీరయ్య సినిమాని నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమాకి కెమెరా: ఆర్దర్ ఏ విల్సన్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్, కధ, డైలాగ్స్: బాబి, స్క్రీన్‌ప్లే: కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి అందిస్తున్నారు. ఈ సినిమా జనవరి 13న విడుదల కాబోతోంది.