మహేష్-త్రివిక్రమ్ సినిమా తాజా అప్‌డేట్

సూపర్ స్టార్ మహేష్ బాబు, త్రివిక్రం శ్రీనివాస్‌ కాంబినేషన్‌లో తెర కెక్కబోతున్న #ఎస్ఎస్‌ఎంబీ28 సినిమా షూటింగ్‌కి సంబందించి ఓ తాజా అప్‌డేట్ ఇచ్చింది ఈ సినిమాని నిర్మిస్తున్న హారిక & హాసిని క్రియెషన్స్ సంస్థ. జనవరి నుంచి ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ నాన్ స్టాపుగా జరుగుతుందని తెలియజేస్తూ మహేష్ బాబు, త్రివిక్రం శ్రీనివాస్‌ తదితరులతో కూడిన కొన్ని ఫోటోలని మహేష్ బాబు అభిమానుల కోసం ట్విట్టర్‌లో షేర్ చేసింది. 

ఈ సినిమాలో మహేష్ బాబుకి జోడీగా పూజా హెగ్డే నటిస్తోంది. దీనిని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు. 

దీని తర్వాత మహేష్ బాబు రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయబోతున్నాడు. ఆ సినిమా షూటింగ్‌ 2023 జూన్ నుంచి మొదలవవచ్చని రాజమౌళి తండ్రి, ఆ సినిమాకి కధ అందించబోతున్న విజయేంద్ర ప్రసాద్ ఇటీవలే తెలిపారు. కనుక త్రివిక్రం శ్రీనివాస్‌తో సినిమా త్వరగా పూర్తి చేయగలిగితే రాజమౌళితో సినిమా మొదలుపెట్టేలోగా మహేష్ బాబు మరొక్క సినిమా చేసే అవకాశం ఉంటుంది. ఒక్కసారి రాజమౌళితో సినిమా మొదలుపెడితే మరో మూడు నాలుగేళ్ళవరకు మరో సినిమా చేయలేదు కనుక ఆలోగా మరొక్క సినిమా చేయాలని మహేష్ బాబు అభిమానులు కోరుకొంటున్నారు. త్రివిక్రం శ్రీనివాస్‌ ఎంత త్వరగా సినిమా పూర్తిచేయగలడనే దానిపైనే మహేష్ బాబు మరో సినిమా చేయగలదా లేదా అనేది ఆధారపడి ఉంటుంది.