రెండు దశాబ్ధాల తర్వాత పవన్‌ కళ్యాణ్‌ మార్షల్ ఆర్ట్స్

పవన్‌ కళ్యాణ్‌, నిధి అగర్వాల్ జంటగా నటిస్తున్న హరిహర వీరమల్లు సినిమా షూటింగ్ హైదరాబాద్‌, రామోజీ ఫిల్మ్ సిటీలో శరవేగంగా సాగుతోంది. దాదాపు రెండు దశాబ్ధాల తర్వాత పవన్‌ కళ్యాణ్‌ మళ్ళీ ఈ సినిమాలో ఓ కీలకమైన ఫైట్ సన్నివేశం కోసం మార్షల్ ఆర్ట్స్ ప్రాక్టీస్ చేస్తున్నారు. ఆ ఫోటోని పవన్‌ కళ్యాణ్‌ అభిమానులతో ట్విట్టర్‌లో షేర్ చేసుకొన్నారు. ఈ సినిమా దర్శకుడు క్రిష్ జాగర్లమూడి స్పందిస్తూ “పవన్‌ కళ్యాణ్‌ సర్, హరిహర వీరమల్లు సెట్స్‌లో ముందువరుసలో కూర్చొని మార్షల్ ఆర్ట్స్ లో మీకున్న అద్భుతమైన ప్రావీణ్యాన్ని చూసే అదృష్టం కలిగినందుకు నేను చాలా సంతోషిస్తున్నాను. దీని కోసం మీ అభిమానులు ఎదురుచూస్తున్నారు...” అంటూ ట్వీట్ చేశారు. 

హరిహర వీరమల్లు 17వ శతాబ్దంలో మొగలుల కాలంలో జరిగిన కధగా తీస్తున్నారు. ఈ సినిమాకు ఫోటోగ్రఫీ: జ్ఞానశేఖర్ విఎస్, ఎంఎం కీరవాణి సంగీతం అందిస్తున్నారు. ఈ సినిమాలో ఆదిత్య మెనన్, పూజిత పొన్నాడ, బాలీవుడ్‌ నటులు నర్గీస్ ఫక్రీ, అర్జున్ రాంపాల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. 

సుమారు రూ.120-200 కోట్ల భారీ బడ్జెట్‌తో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళం భాషల్లో తీస్తున్న ఈ సినిమాను ఏ దయాకర్ రావు మెగా సూర్యా ప్రొడక్షన్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్నారు. ఈ సినిమా 2023, మార్చి 30వ తేదీన విడుదల కాబోతోంది.