నయనతార కనెక్ట్ ట్రైలర్‌... టెరిఫిక్!

నయనతార తాజా చిత్రం కనెక్ట్ ఈ నెల 22వ తేదీన విడుదల కాబోతోంది. ఈ సందర్భంగా ఈ సినిమా ట్రైలర్‌ విడుదల చేశారు. ఇదో హర్రర్ చిత్రం. అదేమీ విశేషం కాదు. కానీ ఈ చిత్రానికి దర్శకుడు అశ్విన్ శరణన్ ఎంచుకొన్న టైమింగ్ చాలా వెరైటీగా ఉంది. దేశంలో లాక్‌డౌన్‌ విధించినప్పుడు జరిగిన ఘటనలతో చాలా సినిమాలే వచ్చాయి. కానీ లాక్‌డౌన్‌ నేపధ్యంలో హర్రర్ చిత్రం ఇదే మొదటిది కావచ్చు. 

నయనతార, సత్యరాజ్, అనుపమ్ ఖేర్, హానియా నసీఫా ప్రధాన పాత్రలు చేశారు. నయనతార పెళ్ళి చేసుకొన్న తర్వాత వస్తున్న మొదటి చిత్రం ఇది. ఆమె భర్త విగ్నేష్ శివన్ నిర్మాతగా రౌడీ పిక్చర్స్ పతాకంపై ఈ సినిమాని తెరకెక్కించారు. ఈ సినిమాలో నయనతార తండ్రిగా సత్యరాజ్, ఆమె కుమార్తెగా హానియా నసీఫా నటించారు. లాక్‌డౌన్‌కి ముందు వారందరూ ఎంతో సంతోషంగా జీవిస్తున్నట్లు చూపారు. లాక్‌డౌన్‌ మొదలైన తర్వాత వేర్వేరు ప్రాంతాలలో వారందరూ ఉన్నప్పుడు నయన్ కూతురికి దెయ్యం పడుతుంది. కానీ లాక్‌డౌన్‌ కారణంగా ఎవరూ ఆమెకి సహాయపడలేని పరిస్థితి నెలకొంటుంది. 

ఆ సమయంలో దెయ్యాలను వదిలించే వ్యక్తిగా బాలీవుడ్‌లో సీనియర్ నటుడు అనుపమ్ ఖేర్ ఎంట్రీ ఇస్తారు. కానీ ఆయన కూడా నయన్ కూతురు వద్దకు వెళ్ళలేని పరిస్థితిలో వీడియో కాలింగ్ ద్వారా ఆమెకి ఏవిదంగా నయం చేశాడనేదే కధ. 

అందరూ వేర్వేరు ప్రాంతాలలో ఉన్నట్లు చూపుతూ, కేవలం మొబైల్ ఫోన్లలో మాట్లాడుకొంటూ దెయ్యం కధని రక్తి కట్టించడం మామూలు విషయమేమీ కాదని చెప్పవచ్చు. కానీ ట్రైలర్‌ చూస్తే దర్శకుడు అశ్విన్ శరవణన్ ఈ ప్రయత్నంలో విజయం సాధించినట్లే కనబడుతోంది. 

ఇటువంటి హర్రర్ సినిమాలకి సంగీతం, ఫోటోగ్రఫీ అతి ముఖ్యమైనవని అందరికీ తెలుసు. ట్రైలర్‌ చూస్తే సంగీత దర్శకుడు పృధ్వీ చంద్రశేఖర్‌, సినిమాటోగ్రాఫర్ మణికంఠన్ కృష్ణమాచారి సినిమాకి కావలసిన అద్భుతమైన ఎఫెక్ట్ అందించినట్లు అర్దం అవుతోంది. ఇక ఈ కనెక్ట్ సినిమా మరో ప్రత్యేకత ఏమిటంటే దీని నిడివి కేవలం 99 నిమిషాలే కనుక మద్యలో ఇంటర్వెల్ ఉండదు!