వీర సింహారెడ్డి
నందమూరి బాలకృష్ణ నటిస్తున్న వీర సింహారెడ్డి సినిమా రిలీజ్ డేట్ వచ్చేసింది. ఈ సినిమా జనవరి 12న విడుదల కాబోతోంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఈ సినిమా కూడా మాస్ మసాలా మూవీ అని టైటిల్ చూస్తేనే అర్దమవుతోంది.
వీరసింహారెడ్డి చిత్రంలో వరలక్ష్మి శరత్ కుమార్, దునియా విజయ్, హనీ రోజ్, లాల్, చంద్రికా రవి తదితరులు కీలకపాత్రలు చేస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై ఈ సినిమాను నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు డైలాగ్స్ సాయి మాధవ్ బుర్రా, కెమెరా రిషి పంజాబీ, ఎడిటింగ్ నవీన్ నూలి, సంగీతం ఎస్.ధమన్ అందిస్తున్నారు.
వాల్తేర్ వీరయ్య
మెగాస్టార్ చిరంజీవి, కెఎస్ రవీంద్ర (బాబీ) దర్శకత్వంలో వాల్తేర్ వీరయ్య సినిమా సంక్రాంతికి వస్తోందని ముందే తెలుసు కానీ ఖచ్చితంగా ఎప్పుడు అనేది ఇంతవరకు తెలుపలేదు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ కూడా ప్రకటించేశారు. జనవరి 13న విడుదల చేయబోతున్నట్లు సోషల్ మీడియాలో రిలీజ్ డేట్ పోస్టర్‌ను ఈరోజు విడుదల చేశారు. దానిలో చిరంజీవి పడవలో చేపలవేటకి బయలుదేరినట్లు చూపారు. ఓ చేతిలో బల్లెం వంటి ఆయుధం, నుదుటన ఎర్రగుడ్డ కట్టుకొని చాలా రఫ్-లుక్‌తో కనిపిస్తారు. ఈ పోస్టర్ మాస్ ఆడియన్స్‌ని చాలా ఆకట్టుకొనేలా ఉంది.
ఈ సినిమాలో చిరంజీవికి జోడీగా శ్రుతీ హాసన్ నటిస్తోంది. మాస్ మహారాజ రవితేజ ఈ సినిమాలో ఓ ముఖ్య పాత్ర చేస్తున్నాడు. ఈ సినిమాలో రాజేంద్ర ప్రసాద్, కేథరిన్ ధెరిసా, బాబీ సింహా తదితరులు ముఖ్యపాత్రలు చేస్తున్నారు.
వాల్తేర్ వీరయ్య సినిమాకి దర్శకుడు బాబీ కధ, డైలాగ్స్ అందించగా, కోన వెంకట్, కె చక్రవర్తి రెడ్డి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. నవీన్ ఎర్నేని, వై.రవిశంకర్ కలిసి మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పై నిర్మిస్తున్న ఈ సినిమాకి కెమెరా: ఆర్దర్ ఏ విల్సన్, సంగీతం: దేవిశ్రీ ప్రసాద్ అందిస్తున్నారు.
ఈ రెండు సినిమాలలో కూడా హీరోయిన్ శృతిహాసన్ కావడం విశేషం. అలాగే ఈ రెండు సినిమాలు కూడా మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్‌పైనే ఒకే నిర్మాతలు నిర్మిస్తుండటం మరో విశేషం. ఒకే బ్యానర్‌పై ఒకే నిర్మాతలు నిర్మించిన రెండు సినిమాలు కేవలం ఒక్క రోజు గ్యాప్‌తో విడుదలవుతుండటం విశేషమే కదా?