
సూపర్ స్టార్ మహేష్ బాబు- త్రివిక్రం శ్రీనివాస్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రం షూటింగ్ కోసం ప్రస్తుతం చిత్రబృందం అంతా ముంబై వెళ్ళారు. అక్కడ కొన్ని కీలకమైన సన్నివేశాలు, హీరోయిన్ పూజా హెగ్డేతో ఓ డ్యూయెట్ సాంగ్ షూట్ చేయబోతున్నట్లు తెలుస్తోంది. ఈసారి వారితోపాటు మహేష్ బాబు భార్య నమ్రత కూడా ముంబై వెళ్ళారు. ఈ సందర్భంగా అక్కడ ఆమె తన స్నేహితురాలు సాజియా ఇంటికి మహేష్ బాబు, దర్శకుడు త్రివిక్రం శ్రీనివాస్, సంగీత దర్శకుడు తమన్ తదితరులతో కలిసి భోజనానికి వెళ్ళారు. ముంబై వంటి అతిపెద్ద కలల ప్రపంచంలో మధురనుభూతిని కలిగించిన క్షణాలు ఇవీ. మంచి రుచికరమైన ఇంటి భోజనం తినిపించినందుకు సాజియాకి కృతజ్ఞతలు. ముంబై... స్నేహితులు... ఇంటి భోజనం అంటూ హ్యాష్ టాగ్స్ తో సాజియా ఇంట్లో దిగిన గ్రూప్ ఫోటోని తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేశారు.
ఈ సినిమాకు “అసుర సంధ్యవేళ” అని పేరు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనిలో పూజా హెగ్డే, శ్రీలీల హీరోయిన్లుగా నటిస్తున్నారు. కన్నడ నటుడు రవిచంద్రన్ మహేష్ బాబుకి తండ్రిగా నటించబోతున్నట్లు సమాచారం.
ఈ సినిమాని హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్‌పై ఎస్.రాధాకృష్ణ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంగీతం ఎస్.తమన్, కెమెరా: పిఎస్ వినోద్, ఎడిటింగ్ నవీన్ నూలి, ఆర్ట్ డైరెక్టరుగా ఏఎస్ ప్రకాష్ పనిచేస్తున్నారు.