నా సినిమాని అందరూ కలిసి చూడలేరు: వర్మ

రాంగోపాల్ వర్మ స్వీయ దర్శకత్వంలో తన సొంత ‘కంపెనీ బ్యానర్‌’పై నిర్మించిన చిత్రం డేంజరస్. ఈనెల 9న తెలుగు, తమిళ్, హిందీ భాషల్లో విడుదల కాబోతోంది. ఈ సినిమా ప్రమోషన్స్‌లో భాగంగా రాంగోపాల్ వర్మ నిన్న హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడుతూ, “ఇద్దరు అమ్మాయిల మద్య జరిగే ప్రేమ కధ ఇది. దీనిలో హీరో ఉండడు కనుక హీరోయిన్లే రొమాన్స్, డ్యూయెట్ సాంగ్స్ వగైరాలన్నీ చేస్తారు. ఈ సినిమాలో హీరో తప్ప మిగిలినదంతా కమర్షియల్ ఫార్మాట్‌లోనే ఉంటుంది. 

ఇద్దరు యువతుల మద్య ప్రేమ, శృంగారం (లెస్బియన్) సంస్కృతి అమెరికా, యూరోప్ దేశాలలో ఎప్పటి నుంచో ఉంది. భారత్‌లో నేటికీ సమాజం ఆమోదం లేనప్పటికీ సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. కనుక లెస్బియన్ కధాంశంతో సినిమా తీస్తే ఎలా ఉంటుందనే ఆలోచనతో నైనా గంగూలీ, అప్సరా రాణిలను హీరోయిన్లుగా పెట్టి ఈ డేంజరస్ సినిమా తీశాను. ఇద్దరు అమ్మాయిల మద్య ప్రేమ, శృంగారం ఎలా ఉంటుందని తెలుసుకోవాలని మగవాళ్ళు కోరుకొంటారని నేను ఓ సర్వే నివేదికలో చూశాను. కనుక ఈ సినిమా తీశాను. 

అయితే ఈ సినిమాని కుటుంబంలో అందరూ కలిసి చూడలేకపోవచ్చు కానీ విడివిడిగా చూసి ఎంజాయ్ చేస్తారని మాత్రం చెప్పగలను. ఆ నమ్మకంతోనే నేను ఈ డేంజరస్ సినిమా తీశాను. ఈ సినిమా పూర్తిచేసిన తర్వాత నాకు కాన్ఫిడెన్స్ పెరిగింది. ఇకపై హీరోల డేట్స్ లభించలేదని ఎదురుచూస్తూ కూర్చోనక్కరలేదు. ఎంచక్కా ఇద్దరు హీరోయిన్లని పెట్టి సినిమా తీసేయోచ్చని అర్దమైంది,” అని అన్నారు. 

ఒకప్పుడు రాంగోపాల్ వర్మ మంచి కధ, కధనాలతో అందరూ కలిసి చూడదగ్గ చక్కటి సినిమాలు తీశారు. కానీ వరుస హిట్స్ పడటంతో అతని మాట తీరు, ప్రవర్తన, ఆలోచనావిదానంలో చాలా మార్పు వచ్చింది. తాను ఓ గొప్ప మేధావినని తాను ఏం చేసినా, ఏం మాట్లాడినా, ఏం తీసినా చెల్లుతుందనే స్థాయికి చేరుకోవడంతో ఆ ప్రభావం ఆయన సినిమాలపై కూడా పడింది. అప్పటి నుంచి ఒక్క హిట్ కూడా ఇవ్వలేకపోయారు. 

కానీ సోషల్ మీడియా పుణ్యమాని నిత్యం ఏదో వివాదాస్పదమైన వ్యాఖ్యలు, ఫోటోలు, వీడియోలతో నేటికీ ఇండస్ట్రీలో నేనున్నానని గుర్తు చేస్తుంటారు. మహిళలని శృంగార పరికరాలుగా భావించే రాంగోపాల్ వర్మకి లెస్బియన్ కధాంశంగా సినిమా తీయాలనుకోవడం సహజమే. కనుక డేంజరస్ సినిమాలో వారిని అలాగే చూపించినట్లు పోస్టర్లు, టీజర్‌ వగైరాలు చూస్తే అర్దమవుతోంది. అందుకే తన సినిమాని అందరూ కలిసి చూడలేరని ఆయనే స్వయంగా చెప్పుకొన్నారు. నిజానికి కేంద్ర ప్రభుత్వం అనుమతిస్తే రాంగోపాల్ వర్మ నేరుగా నీలి చిత్రాలే తీసేవారేమో? కానీ ఆ అవకాశం లేక ఇటువంటి డేంజరస్ చిత్రాలతో సరిపెట్టుకొంటున్నారని భావించవచ్చు.